భగవద్గీత-విశిష్టత

 ఓం శ్రీ అచ్యుత గురు పరబ్రహ్మణే నమః
ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్,
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే.
వ్యాస భగవానుని వాక్కు నుండి జాలువారిన మహాభారతము నందలి భగవద్గీతను రచించి ఈ జగత్తునకు అందించిన విఘ్న నాయకునికి వందనములు.
వసుదేవసుతం దేవం కంస చాణూర మర్దనమ్,వద్గీత
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్.
నిగూఢ యోగార్థములున్న శ్రీమద్భగవద్గీత గ్రంథరాజమును ఉన్నత ప్రమాణములతో నభూతో నభవిష్యతిగా అందించిన యోగీశ్వరుడు శ్రీకృష్ణునకు వందనములు.
పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం
వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతమ్, 
అద్వైతామృత వర్షిణీం, భగవతీం అష్టాదశాధ్యాయినీం
అంబ త్వామను సందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్.
       భగవంతుడగు నారాయణునిచే సూక్ష్మాతి సుక్ష్మమైన యోగ విషయములను అర్జునునకు స్వయముగా బోధించినదియూ, మహాభారతములో మధ్యభాగమున, పురాణముని అయిన వ్యాసునిచే కూర్చబడినదియు, 18 అధ్యాయములతో అమృత తత్త్వమును అమృతముగా కురిపించినట్టిదియు, అగు ఓ తల్లీ, భగవద్గీతా, మీకు నేను నమస్కరిస్తున్నాను.
“కృష్ణస్తు భగవాన్ స్వయం” – కృష్ణుడు స్వయముగా భగవానుడే అని అర్థము.
“వృష్ణీనాం వాసుదేవో స్మి” – వృష్ణి వంశస్థుడైన వాసుదేవుడగు శ్రీకృష్ణుడను నేనే అని భగవద్గీతలో భగవంతుడు స్వయముగా చెప్పినపుడు గీతను చెప్పినది భగవంతుడనుటకు సందేహము లేదు.
ఇక ‘ గీ ‘ అనగా గీతను పఠనము చేయువారిని, ‘ త ‘ అనగా తరింప జేయునది అని కొందరు చెప్పెదరు.
గీతా స్తోత్ర కదంబము :–
గీకారం త్యాగరూపం స్యాత్తత్త్వ బోధం తకారమ్,
గీతావాక్య మిదం తత్త్వం జ్ఞేయం సర్వముముక్షుభిః.
అని గీతా మాహత్మ్యము చెప్పుచున్నది. అనగా ‘ గీ ‘ అనగా త్యాగము. మనము చేయు ప్రతి పని యొక్క ఫలములను భగవంతునికి అర్పించుటను సర్వ కర్మఫల త్యాగము అందురు. ‘ త ‘ అనగా తత్త్వ జ్ఞానమును బోధించునది అని ముముకక్షువుల భావన. కుడి చేత్తో చేసే దానధర్మములు ఎడమ చేతికి తెలియ కూడదంటారు పెద్దలు. స్వార్థ బుద్ధితో ” నేను ఈ పుణ్యకార్యములు చేశాను అని పది మందికి తెలియ చెప్పుకోవడము, నేను ఇంత దానము చేశాను కావున నాకు ఈ పుణ్య ఫలములు. కావాలని ” ఆశించడము త్యాగమనిపించుకోదు. గీత అనగా హద్దు, పరిధి అని కూడా అర్థాన్నిస్తుంది. తన్ను చేరగోరు ఆసక్తిగల జిజ్ఞాసులకు భగవంతుడు కొన్ని నియమములను నిర్దేశించాడు. వీటిని తూ- చా తప్పకుండా పాటించిన వారి హృదయాలలో ఎల్లప్పుడూ కొలువై ఉంటాడు.
భగవద్గీత పుట్టుక యెప్పటిదని ఒక సారి పరిశీలిస్తాము. వ్యాసభగవానుని చే విరచితమైన భవిష్యపురాణం ప్రతీసర్గ పర్వం, 4వ అధ్యాయము 10 వ శ్లోకం నుండి 20 శ్లోకములలో “నారాయణం పూజ ఇత్వా మ్లేచః సహ భార్యయా. . . . . . . . సాక్షాధ్భగవన్ భక్తవత్సలః ” అనగా కలిభూపతి మ్లేచ్చ (పాశ్చాత్య నాగరికత) రూపుడై తన భార్యతో కలిసి “తనకు భూలోక రాజ్యమును పరిపాలించుటకు అనుమతిని ఇవ్వవలసినదిగా ” శ్రీమన్నారాయణుని పూజించగా, భక్తవత్సలుడై న సాక్షాత్ భగవంతుడు కలితో ” నీ కోరిక తీరుతుంది ” అనెను.
ఆదమోనామ పురుషః పత్నీ హవ్యవతీ తథా 
ఆదాముడనే పేరుగల పురుషుడిని హవ్యవతీ అనే స్త్రీని సృష్టించెదను.
ద్విశతాష్ట సహస్త్రీద్వేశేషేతు ద్వాపర యుగే 
మ్లేచ్చదేశస్య యాభూమిర్భవితా 
రెండువేల యెనిమిది వందల సంవత్సరాలు (2800) ద్వాపరయుగాంతము ముగియుటకు ముందుగా మ్లేఛ్ఛ దేశములో పై చరిత్ర ఆరంభమగును.
అనగా క్రైస్తవులు, మహమ్మదీయుల మూల పురుషులైన ఆదాము, అవ్వ 2800 సంవత్సరములు క్రీస్తు పుట్టుటకు పూర్వము పుట్టిరని తెలియుచున్నది.
భారత యుధ్ధము మార్గశిర మాస శుధ్ధ ఏకాదశి దినమున ఆరంభమైనట్లు మహాభారత కావ్యము నందున్నది. భారత యుధ్ధము నందు బ్రహ్మాస్త్రము వేసినది 3138 బి.సి. లో అని చరిత్రకారలు నిర్ధారించినారు. అనగా పరీక్షిత్తు జననము, ధర్మరాజు పట్టాభిషేకము కూడా ఆ సంవత్సరములోనే జరిగినది. కనుక ఖురాను మరియూ బైబిలు మత గ్రంథముల యొక్క మూలము భగవద్గీత అగుచున్నది.

© Copyright శ్రీ భగవధ్గీత