వెనకకు భగవద్గీత ముందుకు

1 అర్జునవిషాద యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ప్రథమోऽధ్యాయః - అర్జునవిషాదయోగః

2వ శ్లోకం

సఞ్జయ ఉవాచ |
దృష్ట్వా తు పాణ్డవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా |
ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ||1-2||

సంజయుడు పలికెను:
సైనిక వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూచిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని సమీపించి ఈ విధంగా పలికెను.

అపుడు రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సిద్ధమైన పాండవసేనను చూసి, ద్రోణాచార్యునివద్దకు వెళ్ళి ఇట్లనెను.
ధృతరాష్ట్రుడు పుట్టుకతో గుడ్డివాడైనా అతడికి అంతరజ్ఞాన నేత్రం వరంగా వుంది, కానీ అతడి అతిప్రేమ వలన అది కూడా కనబడనీయడం లేదు. అతని పుత్రవాత్సల్యం వలన ఎక్కడ తన కొడుకు అర్ధ రాజ్యం ఇచ్చేస్తారోనన్న ఆదుర్దా కనబడుతోంది. సంజయునికి మహారాజు ఆంతరం తెలుసుకనుక ఆయనకు ఊరట కలిగిస్తూ పాండవుల వ్యూహం చూసిన దుర్యోధనుడు గురువుల వద్దకు వెళ్ళిన విషయం వివరిస్తున్నాడు. పైకి గాంభీర్యం నటిస్తున్నా, పాండవుల సేనను చూసి లోన భయపడిన రారాజు అది కప్పిపుచ్చుకోవడానికి తన గురువు ద్రోణుని వద్దకు వెళ్ళాడు. .

"పూల మాలలో గాని, పుష్పగుచ్చం లో గాని
ఎన్నుకొన్న చక్కని పూలని కావలసిన పద్ధతి లో
కూర్చిన విధంగా గీత లో వస్తావ విషయాలు ఏర్పడ్డాయి . "
-స్వామి వివేకానంద