వెనకకు భగవద్గీత ముందుకు

1 అర్జునవిషాద యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ప్రథమోऽధ్యాయః - అర్జునవిషాదయోగః

23 వ శ్లోకం

యోత్స్యమానానవేక్షేऽహం య ఏతేऽత్ర సమాగతాః |
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః ||1-23|| .

దుర్బుద్ధి కలిగిన దుర్యోదనునికి ప్రియం చేయగోరి యుద్ధం చేయడానికి ఎవరెవరు ఇక్కడ సమావేశమై ఉన్నారో వాళ్ళను నేను చూస్తాను.

కబంధ హస్తాలు

వాల్మీకి రామాయణంలో కబంధుడు అనే పేరుగల ఒక రాక్షసుడు ఉన్నాడు. శ్రీరాముడు, లక్ష్మణుడు సీతను వెతుకుతూ అరణ్యంలో సంచరిస్తూ ఉండగా విచిత్ర రూపంలో ఉన్న ఓ రాక్షసుడు వారికి తటస్థ పడ్డాడు. అతనికి తల, మెడ, కాళ్ళు లేవు. ఉదరం- అంటే కడుపు భాగంలో మాత్రం ఓ పేద్ద నోరుంది. ఊరువుల ప్రదేశంలో రెండు ఉగ్రనేత్రాలున్నాయి. అతని బాహువులు మాత్రం ఎనిమిది యోజనాలవరకు విస్తరించి ఉన్నాయి. అటువంటి రాక్షసుడు ఒక్కసారిగా రామలక్ష్మణులను తన హస్తాలతో పెనవేసి గుప్పిట్లో బిగించాడు. భయకరమైన నోటిని తెరిచి వారిని ఆరగించబోతుండగా రాముడు కుడి చేతిని, లక్ష్మణుడు ఎడం చేతిని నరికివేయడంతో అతను నేలకి ఒరిగి పోయాడు. తనని గాయపరిచినది రాముడు అని తెలుసుకుని కబంధుడు ఎంతో సంతోషించాడు. అతని వికృత రూపానికి కారణం చెప్పాడు.
కబంధుడు ధనవు అనేవాడి కుమారుడు. చాలా సుందరుడైన కబంధుడు ఒకప్పుడు గర్వంతో విహరిస్తూ ఉండేవాడు. ఒకసారి వినోదంకోసం వికృతరూపం ధరించి స్థూలశిరుడనే మునిని బాధించాడు. అతను కోపించి ఆ వికృతరూపం శాశ్వతంగా ఉంటుందని శపించాడు. శ్రీరాముడి చేతిలో అగ్నిలో దహించబడితేనే పూర్వపు రూపు వస్తుందని శాపవిమోచనం చెప్పాడు.అప్పుడు బ్రహ్మకోసం తపస్సుచేసి దీర్ఘాయువు పొందాడు.బ్రహ్మ వరం ఉంది కదా అనే ధైర్యంతో ఇంద్రుడితో యుద్ధం చేసాడు. ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని విసరడంతో కబంధుడి తల కాళ్ళు దేహంలోకి చొచ్చుకుపోయి విచిత్రరూపంలోకి మారిపోయాడు. పూర్తిగా వధించమని ఎంత ప్రాధేయపడినా బ్రహ్మశాపం వృథా పోకూడదని ఇంద్రుడు కబంధుడిని అలాగే వదిలి వెళ్ళిపోయాడు. ఆరూపంలో అక్కడే పడి ఉండి తన సమీపానికి వచ్చిన పెద్దపెద్ద జంతువులను కూడా యోజనాల తరబడి విస్తరించి ఉన్న తన హస్తాలతో బంధించి తేలికగా ఆరగించేవాడు కబంధుడు. రామలక్ష్మణులు చేతులు నరకి, అగ్నిలో దహనం చేసారు. ఆవిధంగా తన శాపం పోగొట్టుకున్నాడు కబంధుడు. సీతను వెతకడంలో సుగ్రీవుడు సహాయం చేయగలడని చెప్పిఅతని చిరునామాను రాముడికి ఇచ్చిన వాడు కబంధుడు. సుగ్రీవుడు హనుమంతుడు రాముడికి ఎంత సహాయం చేసారో మనకి తెలిసిన కథే కదా.
చాలా దుర్మార్గుడయిన మనిషి చేతిలో చిక్కి, తప్పించుకోలేక బాధపడే పరిస్థితిలో అతని పట్టును కబంధ హస్తాలు అని వర్ణిస్తారు.

అలో లక్ష్మణా

ఈ జాతీయానికి కూడా ఆధారం రామాయణమే. సీతాదేవిని ఆకర్షించడానికి మారీచుడు బంగారు లేడి రూపంలో వచ్చాడు. సీత దానికోసం ముచ్చటపడింది. తీసుకురావడానికి వెంటాడుతూ రాముడు మారీచుడిని సమీపించాడు. వెంటనే మారీచుడు ఆ హా లక్ష్మణా, హా లక్ష్మణా అంటూ రాముని గొంతుతో అరిచాడు.అన్నకు ఎటువంటి ఆపదారాదు అని ఎంత చెప్పినా వినకుండా బలవంతంగా లక్ష్మణుడిని రాముడిని వెతకమని పంపించింది- సీత. రావణాసురుడు వచ్చి సీతను అపహరించుకుని తీసుకుపోయాడు. అప్పుడు లక్ష్మణుడి మాట విననందుకు బాధతో సీతమ్మ అయ్యో లక్ష్మణా అని దుఃఖించి ఉంటుంది.
ఎవరైనా అనవసరమైన పని చేసి, తర్వాత బాధపడవలసి వచ్చినప్పుడు అలో లక్ష్మణా అని బాధపడ్డారు - అని ఈ జాతీయాన్ని ప్రయోగిస్తారు.

అశోకవనంలో సీత

రామాయణంలో సీతను రావణాసురుడు పంచవటినుంచి అపహరించుకుని తీసుకుపోయాడు. లంకలో సీతమ్మను అశోకవనం లో ఉంచాడు. సీతాదేవి రావణాసురుడు ఎన్ని మాయలు చేసినా అతనికి లొంగక శ్రీరాముడినే ధ్యానిస్తూ ఎప్పుడు రాముడిని చూస్తానా అని దిగులుగా కాలం గడుపుతూ ఉండేది. అలా దిగులుగా కూర్చుని ఉన్న సీతమ్మ రూపం తెలుగువారి జాతీయాలలో చేరింది.
ఎవరైనా దిగులుగా కూర్చుని ఉంటే వారిని అశోకవనంలో సీతలా కూర్చున్నారు అని వర్ణిస్తారు

కామధేనువు:

మన పురాణాల ప్రకారం వశిష్టుడు గొప్ప తపోశక్తి గల ముని. ఆయన భార్య అరుంధతి గొప్ప పతివ్రత. ఒకసారి వశిష్టుడు భూయాగం తలపెట్టాడు. ఆ యాగం ద్వారా వశిష్టుడికి పేరు రావడం సహించలేని ఇంద్రుడు యజ్ఞానికి రకరకాల ఆటంకాలు కల్పించాడు. చివరకు కరువు కాటకాలు సృష్టించాడు. తమను ఆశ్రయించినవారికి ఆకలి దప్పుల బాధ ఉండకూడదని అనసూయ ప్రార్థిస్తుంది. వారికి కామధేనువును అమ్మవారు ప్రసాదిస్తుంది. కోరిన కోరికలన్నీ తీర్చే ధేనువు కామ ధేనువు.
అడిగినది కాదనకుండా, అన్ని కోరికలు తీర్చేవారిని ఇప్పుడు కామధేనువు అనడం జాతీయం.

ఉడతాభక్తి:

రామాయణంలో శ్రీరాముడు రావణాసురుడు ఎత్తుకుపోయిన సీతమ్మని చెర విడిపించడానికి సముద్రంపై వారధి నిర్మించాడు. వానరాలు రాళ్లు మోసి వంతెనకి సహాయం చేయడం చూసి రాముడి పై తన భక్తిని చూపించడానికి ఉడుత తన శరీరాన్ని నేలపై పొర్లించి వెళ్ళి సముద్రంనీటిలో వదులుతూ ఉందిట.రాముడిపై ఉడుత చూపిన ఆ భక్తి ఉడుతభక్తి అని, ఉడుత రాముడికి చేసిన ఆ చిరుసహాయం ఉడతసాయం అని అనడం జాతీయం.
ఒక మహత్కార్యాన్ని తలపెట్టినప్పుడు అది పూర్తికావడానికి ఎందరో సహాయం చేయవలసి ఉంటుంది. ఎవరికి వారు తోచినంత సహాయం చేస్తేనే ఆ పని పూర్తవుతుంది. ఆ కార్యం పూర్తికావడానికి సరిపోయేంత కాకపోయినా సహాయం చేయడానికి ప్రయత్నం చేయడాన్ని ఉడత సాయం అని, ఉడతాభక్తిగా చేయడం అని అంటారు.

అగ్ర తాంబూలం:

మహాభారతంలో ధర్మరాజు రాజసూయయాగం చేసాడు. యాగం చివర శ్రీకృష్ణుడికి అత్యున్నత స్థానం ఇచ్చి అగ్రపూజ చేసి తాంబూలం ఇచ్చి గౌరవించాడు. ఈ ఘట్టం కూడా జాతీయంగా మారింది.
ఏదైనా ఒక అంశానికి ప్రాముఖ్యత కల్పించడం, లేదా ముందుగా గౌరవ మన్ననలు కల్పించడాన్ని" అగ్రతాంబూలం "ఇవ్వడం అనడం జాతీయం.

అనామకం /అనామిక

మన చేతికి ఐదు వేళ్లుంటాయి కదా. ఒక్కొక్కదానికి ఒక్కో పేరు ఉంది. బొటనవేలు అంటే విడిగా కనిపించే పెద్ద వేలు.(మనం ఇప్పుడు లైక్ కొట్టడానికి గుర్తుగా వాడుతుంటామే అది).సంస్కృతంలో దీన్ని అంగుష్టం అంటారు. దాని పక్కన వరుసగా ఉండే వేళ్ళలో మొదటిదాన్ని చూపుడువేలు అంటాం. సంస్కృతంలో దీనిని తర్జని అంటారు. ఆ తర్వాతవేలును మధ్యవేలు అంటాము. దీన్ని సంస్కృతంలో మధ్యమ అని అంటారు. ఆ తర్వాత వేలు అంటే ఆఖరిచిన్నవేలు కి ముందు ఉండే వేలును ఉంగరపు వేలు అంటాం తెలుగులో. సంస్కృతంలో అనామిక అంటారు ఆ అనామిక అనే పేరు వెనుక ఓ కథ ఉంది.
శివపురాణంలోని కథ ప్రకారం బ్రహ్మదేవుడికి ఒకప్పుడు ఐదు తలలుండేవి. బ్రహ్మదేవుడికి, శివుడికి కలిగిన ఘర్షణలో శివుడు తన వేలు గోరుతో బ్రహ్మ ఐదవ తలను ఖండించాడు. అప్పటినుంచి బ్రహ్మకు నాలుగే తలలున్నాయి. ఈ ఐదవతలను సంహరించిన వేలు, బ్రహ్మశిరసును ఖండించడంవల్ల దానిని వేదకర్మలందు ఉచ్చరించకూడదని ఓ నియమం. అందువల్ల పేరులేని వేలుగా అనామిక అని పిలుస్తారు ఆ వేలును.
ఎవరికయినా పేరు చెప్పడానికి వీలులేని పరిస్థితుల్లో అనామిక అని, అనామకముగా ఉందని చెప్పడం ఓ జాతీయం.

శూర్పనఖ మేనకోడలు:


రామయణంలోని పాత్ర శూర్పనఖ! ఈవిడ రావణాసురుడి చెల్లెలు.. రాక్షసతత్వానికి, వంచనకు ప్రతీక. ఇలాంటి స్వభావం ఉన్నస్త్రీలను "శూర్పనఖ మేనకోడలు'' అంటుంటారు.
ప్రత్యేకించి మేనమామ మేనత్త పోలికలు పిల్లలకు వస్తాయనే నమ్మకం ఈ జాతీయానికి మూలం కావొచ్చు!

పద్మవ్యూహం

మహాభారత యుద్ధంలో భీష్ముడు ఓడిపోయిన తర్వాత కౌరవసేనకు ద్రోణాచార్యున్ని సేనాధిపతి చేశాడు దుర్యోధనుడు. యుద్ధంలో పదమూడవ రోజున ద్రోణాచార్యుడు పాండవులను ఓడించేందుకు తన అనుభవాన్ని జోడించి పద్మవ్యూహం పన్నాడు. పాండవ సైన్యం ఆ వ్యూహాన్ని ఛేదించలేకపోయింది. పద్మవ్యూహాన్ని ఛేదించే పరిజ్ఞానము పాండవ పక్షములో శ్రీకృష్ణునికి, అర్జునునికి, ప్రద్యుమ్నునికి (శ్రీకృష్ణుని కొడుకు), మరియు అభిమన్యునికి తప్ప మరెవరికీ లేదు. ప్రద్యుమ్నుడు మహాభారత యుద్ధంలో పాల్గొనడానికి నిరాకరించాడు. పద్మవ్యూహాన్ని గమనించిన ధర్మరాజు సమయానికి అర్జునుడు అందుబాటులో లేకపోవటం వలన గత్యంతరం లేక అభిమన్యున్ని పద్మవ్యూహంలోకి ముందు వెళ్ళమనిపంపించాడు. ఆ వెనుక ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు వెంట రక్షణగా వెళ్ళాలనుకున్నారు. కానీ సైంధవుడు వీరిని సమయానికి అడ్డుకోవడంతో ప్రవేశించిన అభిమన్యునికి ఇలా పాండవుల సహాయం అందలేదు. అయినా వీరోచితంగా పోరాడి, లక్ష్మణకుమారుణ్ణి చంపి, కౌరవుల వ్యూహానికి హతుడైపోతాడు.
ఏదైనా పరిష్కారం సాధ్యం కాని, అతి కష్టమైన సమస్యలని పద్మవ్యూహం అంటారు.

అభిమన్యుడు


మహాభారతంలో సుభద్ర, అర్జునుల కొడుకు అభిమన్యుడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే అర్జునుడు సుభద్రకి పద్మవ్యూహం అనే దుర్భేద్యమయిన వ్యూహం గురించి తెలుసుకున్నాడు. భారతయుద్దం ముగుస్తూ ఉండగా కౌరవులు పన్నిన పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తాడు అభిమన్యుడు. కానీ బయటకి రాలేక యుద్ధంలో మరణిస్తాడు.
ఎవరైనా ఏదైనా సమస్యలో చిక్కుపడి బయటకి రాలేనప్పుడు పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడులా అని అంటారు.

ఏకలవ్యుడు :

మహా భారతంలోని పాత్ర. హిరణ్యధన్వుడనే ఎరుకలరాజు కొడుకు. ద్రోణాచార్యుడు గొప్ప గురువు అని తెలుసుకుని అతని వద్ద శిష్యరికం కోరతాడు. కానీ ద్రోణుడు నిరాకరించాడు. ఏకలవ్యుడు మట్టితో ద్రోణుడి ప్రతిమ తయారుచేసుకుని అతన్నేతన గురువుగా భావించి ధనుర్విద్య నేర్చుకున్నాడు.అర్జునుడిని మించిన విలుకాడయ్యాడు. ఆవిషయం తెలుసుకుని ద్రోణుడు ఏకలవ్యుడుని గురుదక్షిణగా బొటనవేలుని కోసి ఇమ్మన్నాడు. ఏమాత్రం సంకోచించకుండా గురుదక్షిణ చెల్లించాడు ఏకలవ్యుడు.
ఈ కథ ఆధారంగానే ఎవరైనా గొప్పవారిని తమ గురువుగా భావించి, నేరుగా శిష్యరికం చేయకుండా వారిమార్గాన్నే అనుసరిస్తే వారిని ఏకలవ్య శిష్యుడు అనడం జాతీయం అయింది

ఉత్తర కుమారుడు:

మహా భారతంలో విరాటరాజుకొడుకు పేరు ఉత్తరకుమారుడు. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్న ప్పుడు వారిని బయటపెట్టడంకోసం దుర్యోధనాదులు ఉత్తర గోగ్రహణం పేరుతో దండెత్తుతారు. సైన్యం తో పాటు ఉత్తరకుమారుడు కూడా యుద్ధానికి వెళ్లవలసి వస్తుంది. రథసారథి లేడని తప్పించుకోవాలనుకుంటాడు ఉత్తరుడు. బృహన్నలగా ఉన్న అర్జునడు రథ సారథ్యం చేయడానికి ముందుకు వస్తాడు.యుద్ధంలో శత్రువుల తలలు నరికి, చెల్లెలికి బొమ్మలకోసం బొమ్మపొత్తికలు తెస్తానని బీరాలు పలికిన ఉత్తరకుమారుడు, శత్రు పక్షంలో భీష్మద్రోణ విదురులను చూసి యుద్ధానికి వెన్నుచూపి పారిపోతాడు.
ఆ కథను గుర్తుచేసుకుంటూ ఎవరైనా అలా చేస్తాం, ఇలా చేస్తాం అంటూ ప్రతిజ్ఞలు చేసి తీరా సమయం వచ్చినపుడు తడబడితే వారిని ఉత్తరకుమారుడు అని, వారి మాటలు ఉత్తరకుమారుడి ప్రజ్ఞలు అని అంటారు.

© Copyright శ్రీ భగవధ్గీత