వెనకకు భగవద్గీత ముందుకు

1 అర్జునవిషాద యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ప్రథమోऽధ్యాయః - అర్జునవిషాదయోగః

8 వ శ్లోకం

భవాన్భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిఞ్జయః |
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ ||1-8|| .

మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధంలో జయం పొందే కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, అలాగే సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు ఉన్నారు.

......మీరును (ద్రోణాచ్యార్యులు), ఎదురులేని వీరధి వీరుడు మాతాత గారు భీష్మాచార్యులు,అర్జునినిపై విజయం సాధించనల మహావీరుడు కర్ణుడు, సంగ్రామములో ఎప్పిడూ విజయాన్ని పొందే మీ బావమర్ధి కృపాచార్యులు, ఆస్త్ర,శస్త్ర విధ్యాపారంగతుడు మీ కూర్మి నందనుడు అశ్వత్థామ,ధుర్యొధనుడి తమ్ముడు వికర్ణుడు,సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు నను వారు ముఖ్యులు.

ధర్మరాజు పితామహ గురువుల వద్ద యుద్ధానికి అనుమతి తీసుకొనుట

కృష్ణార్జునులు పాంచజన్యం, దేవదత్తాలు పూరించగా అవి పాండవ సైన్యంలో ఉత్సాహాన్ని కౌరవ సైన్యంలో కలతను కలిగించాయి. కౌరవ సైన్యాలకు ఉత్సాహం కలిగించే విధంగా మంగళ తూర్య నాధాలు మ్రోగించారు. ఆ సమయంలో ధర్మరాజు తన ఆయుధములను కవచాన్ని రథంలో వదిలి భీష్ముని వైపు పాదచారి అయి నడువ సాగాడు. అది చూసిన కృష్ణ, సాత్యకి ఇతర ధర్మరాజ సన్నిహితులు కలవర పడి రథాలు దిగి ధర్మరాజును అనుసరించారు. " ఇందరం నీ వెంట ఉండగా నీవు ఇలా పాదచారివై వెడలుట ఏమి. శత్రువులు మనది పిరికితనం అని హేళన చేయరా " అని సోదరులు తలా ఒక విధంగా అడుగుతున్నా ధర్మరాజు మౌనం వీడక చేతులు ముకుళించి నడచి పోతునే ఉన్నాడు. అది చూసిన శ్రీకృష్ణుడు " ధర్మజుని తలపు నాకు తెలుసు. అతడు భీష్మ, ద్రోణ, కృపాచార్య, శల్యులకు నమస్కరించి యుద్ధం చేయడానికి అనుమతి తీసుకోవడానికి వెళుతున్నాడు. అలా చేస్తే విజయం తధ్యం " అన్నాడు. ఆ మాటలు విని అందరూ మౌనంగా జరిగేది వీక్షించ సాగారు. కృషార్జున, నకులసహదేవ, భీమాదులతో ధర్మరాజు భీష్ముని ఎదుట నిలువగా కౌరవ ప్రముఖులు మాత్రం ధర్మరాజులోని రాకకు అంతర్యం తెలియక భీమార్జున, నకులసహదేవ, ద్రుపద, సాత్యకుల అండ ఉన్న ధర్మరాజుకు భయమేల అని కొందరు అనుకోసాగారు. ధర్మరాజు పిరికి వాడు కాదు అయినా ఈ సమయంలో ఈ రాకలోని అంతర్యం ఏమిటో అనుకున్నారు. మానధనుడైన ధర్మరాజు ఏమి మాట్లాడతాడో, భీష్ముడు ఎలా సత్కరిస్తాడో, కృష్ణార్జునుల అంతర్య మేమిటో, భీమాదులు ఏమి చెప్తారో అని పలు పలు విధాలుగా ఆలోచించసాగారు. ధర్మరాజు భీష్ముని ఎదుట నిలిచి " మహానుభావా ! మీ ఎదుట నిలిచి యుద్ధం చేయవలసిన దుస్థితికి చింతిస్తున్నాను. మీ దీవెనలకు అనుమతికి వచ్చాను నాకు యుద్ధం చేయడానికి అనుమతి ఇచ్చి నన్ను దీవించండి . మీ దీవెనలు నాకు విజయాన్ని ప్రసాదిస్తుంది " అన్నాడు. భీష్ముడు ఆనందించి " ధర్మనందనా ! ఈ సమయంలో నీ రాక సముచితమే కాక ఎంతో శ్రేయస్కరం కూడా . నీవిట్లు చేయకున్న నా శాపానికి గురికావలసి ఉండేవాడివి. ఇక నీకు జయం కలుగుతుంది. నీ పక్షాన యుద్ధం చేయడం తప్ప ఏదైనా వరం కోరుకో అనుగ్రహసిస్తాను. నీకు మేలు జరుగుతుంది " అన్నాడు. ధర్మరాజు " పితామహా ! మీరు రారాజు తరఫున యుద్ధం చేయండి కాని మాకు మేలు చేయండి " అని కోరాడు. భీష్ముడు " ధర్మరాజా ! నీ ఆంతర్యం వివరించు " అన్నాడు. ధర్మరాజు " పితామహా ! మరేమి లేదు మీతో యుద్ధం చేసి గెలవడము ఎలాగో వివరించండి " అన్నాడు. భీష్ముడు చిరునవ్వుతో " ధర్మరాజా ! నాతో రణరంగాన గెలవడం దేవతలకు కూడా సాధ్యం కాదు. అడిగావు కనుక చెప్తాను. నే చేతి ఆయుధం కింద పడిన కాని అది సాధ్యం కాదు. ఇప్పటికి ఇంతకంటే చెప్పను . ఈ సారి మన కలయిక నీ మనోరధాన్ని నెరవేర్చ గలదు " అన్నాడు. భీష్ముని వద్ద అనుమతి పొందిన ధర్మరాజు తన వారితో కలసి ద్రోణ, కృపాచార్య, శల్యులకు నమస్కరించి వారి అనుమతి పొందాడు. ద్రోణుడు " ధర్మజా ! శ్రీకృష్ణుని అండ ఉన్న నీకు విజయం తధ్యం అన్నాడు. ధర్మరాజు ద్రోణుని అతడిని గెలిచే ఉపాయాన్ని చెప్పమని ప్రార్ధించాడు. ద్రోణుడు " ధర్మరాజా ! నా చేతిలో ఆయుధమున్నంత వరకు నన్ను గెలవడం సాధ్యం కాదు కాని నేను అస్త్రసన్యాసం చేసినా ప్రాయోపవేశం చేసినా నన్ను వధించగలరు. అశుభ వార్త వినినంతనే అస్త్రసన్యాసం చేస్తాను " అన్నాడు . కృపాచార్యుని గెలిచే ఉపాయం అడుగగా అతడు " నేను ఎవరి చేత చంపబడను కాని నీకు జయం తథ్యం " అన్నాడు. శల్యుని చూసి ధర్మరాజు తనకిచ్చిన మాట గుర్తు ఉంచుకొమ్మని చెప్పగా. అతడు ధర్మరాజుతో అతడికి ఇచ్చిన మాట గుర్తు ఉన్నదని అలాగే చేస్తానని నిశ్చింతగా ఉండవచ్చని మాట ఇచ్చాడు. శ్రీకృష్ణుడు యుద్ధాన్నికుతూహలంతో చూడవచ్చిన కర్ణుని చూసి " కర్ణా ! భీష్ముని మీద కోపంతో అతడు పడిపోయే వరకు యుద్ధం చేయనని చెప్పావట కదా ! అప్పటి వరకు పాండవ పక్షాన యుద్ధం చేస్తూ వినోదించవచ్చు కదా ! " అన్నాడు. కర్ణుడు " కృష్ణా ! నేను భీష్ముని మీద కోపంతో యుద్ధం నుండి వైతొలిగాను కాని సుయోధనునికి ఇచ్చిన మాట తప్పనని నీకు తెలియనిదా " అన్నాడు. ఆ పై ధర్మజుడు రధాన్ని అదిరోహించి కవచాన్ని ధరించి కౌరవ పక్షంవైపు కొంత ముందుకు వెళ్ళి " కౌరవ ప్రముఖులారా ! మీలో ఎవరైనా నాపై ఉన్న అభిమానంతో నా పక్షంలోకి రావచ్చు నేను వారిని నా తమ్ముల వలె చూసుకుంటాను " అన్నాడు. ఆ మాటలు విన్న యుయుత్సుడు ధర్మరాజు పక్షంలో చేరటానికి అంగీకరించాడు. యుయుత్సుడు సుయోధనుని దుష్కృత్యములను నిందిస్తూ పాండవులను పొగుడుతూ తన సైన్యాలతో పాండవ పక్షంలో చేరాడు. ధర్మరాజు సంతోషంగా యుయుత్సుని ఆహ్వానించాడు.

భగవద్గీత

దృతరాష్ట్రుడు " సంజయా ! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయు నిశ్చయంతో సమావేశం అయిన నావారైన కౌరవులు, పాండవులు ఏమి చేసారు ?" అని అడిగాడు. సంజయుడు " రాజా ! నీ కుమారుడైన సుయోధనుడు పాండవులు పన్నిన వ్యూహం చూసి ద్రోణుని వద్దకు వెళ్ళి " ఆచార్యా ! దృష్టద్యుమ్న విరచిత సేనలో పాండవ బలం తిలకించండి. భీమార్జున సమాన సాత్యకి, ద్రుపదుడు, చేకితానుడు, పురుజిత్తు, కాశీరాజు, కుంతిభోజుడు, సైభ్యుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ద్రౌపదీ పుత్రులు మొదలైన సైన్యాలు భీమ రక్షితమై పరిమితమై ఉన్నది. ఇక మన సేనలో మీరు, భీష్ముడు, శల్యుడు, వికర్ణుడు, భూరిశ్రవుడు పెక్కు మంది రధికులు అస్త్రాస్త్ర కోవిదులు నా కొరకు ప్రాణాలు ఒడ్డి యుద్ధం చేయ సిద్ధమై ఉన్నారు. భీష్మ రక్షితమైన మన సేనలకు మీరంతా రక్షణగా ఉండి భీష్మునికి రక్షణ కల్పిస్తూ ముందుకు సాగండి " అన్నాడు. భీష్ముడు సుయోధనునికి సంతోషం కలిగించేలా శంఖనాదం చేసాడు. అదివిన్న మిగిలిన వారంతా శంఖధ్వానాలు చేసారు. తూర్యనాదాలు మిన్నంటాయి.

పాండవ సన్నాహం

పాండవ పక్షంలో కృష్ణుడు పాంచజన్యాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని, భీముడు పౌండ్రాన్ని, యుధిష్టరుడు అనంత విజయాన్ని, నకుల సహదేవులు సుఘోష, మణి పుష్పకములు వారితో ద్రుపద, విరాట, సాత్యకి, దుష్టద్యుమ్నుడు, శిఖండి ఇతర ప్రముఖులు తమతమ శంఖములను పూరించారు. ఆ శంఖనాదాలు కౌరవ హృదయాలను ఛేదిస్తూ పాండవ సైన్యాలలో ఉత్సాహం కలిగించింది. అర్జునుడు వింటిని సారించి గాండీవావికి నారిని సంధించి కృష్ణుని చూసి " కృష్ణా ! నేను ఎవరితో యుద్ధం చేయాలో చూడాలి కనుక రధాన్ని ఇరు సైన్యాల మధ్యలోకి తీసుకు వెళ్ళాడు. కృష్ణడు రధాన్ని ఇరుసైన్యాల మధ్య భీష్మ, ద్రోణ, ప్రముఖ యోధుల ఎదుట నిలిపి వారిని చూడమని చెప్పాడు. అర్జునుడు కౌరవ సైన్యంలో ఉన్న కురు వృద్ధులను, గురువులను, అన్నలను, తమ్ములను, కుమారులను, బంధువులను, మిత్రులను చూసి మనసు విషాదంతో నిండి పోగా కృష్ణునితో " కృష్ణా ! దుర్మధాంధుడైన సుయోధనుని వలన ఈ యుద్ధం దాపురించిది కదా. ఇరుపక్షాలలోని బంధు మిత్రులను చూసి నా మనసు వికలమైంది. గాండీవం జారిపోతుంది కాళ్ళు వణికి పోతున్నాయి. ఈ యుద్ధం నేను చేయజాలను. ఎవరి సుఖం కొరకు ఈ యుద్ధం చేస్తున్నామో వారందరి రక్తంలో తడిసిన రాజ్యభోగాలు నాకు సుఖాన్ని ఇస్తాయా ! ఇందువలన కీర్తి, యశస్సు ఎలా వస్తుంది. పదునాలుగు భువనాలను ఏలడానికి కూడా ఈ పాపపు యుద్ధం నేను చేయజాలను. యుద్ధం వలన సంభవించే దుష్పరిణామాలు యోచించక సుయోధనుడు అహంకార పూరితుడై దురాశతో యుద్ధం చేస్తే చేయనీ నేను మాత్రం పెద్దలను, గురువులను, బంధువులను, మిత్రులను సంహరించడమే కాక కుల క్షయానికి కారణమైన ఈ యుద్ధం చేయ నాకు మనస్కరించ లేను. కులక్షయం వలన ధర్మం నశిస్తుంది ధర్మం నశించడం వలన వర్ణ సంకరం ఔతుంది. కుల నాశకులకు నరకం తప్పదు. బంధు మిత్రులను చంపి పాపం మూట కట్టుకొనే ఈ యుద్ధం నేను చేయజాలను " అని రథంపై కూలబడ్డాడు. ఇలా శోక విహ్వలుడైన అర్జునిని చూసి కృష్ణుడు " ఈ విపత్కర సమయంలో నీకు పిరికితనంతో కూడిన ఈ మోహం ఎలా కలిగింది. అవివేకులకు ఇది తగును కాని నీకు కాదు పిరికి తనం వదిలి యుద్ధానికి సన్నద్ధంకా అర్జునా ! లెమ్ము " అన్నాడు. అర్జునుడు " కృష్ణా ! పూజనీయులైన భీష్మ, ద్రోణాదులపై బాణాలు సంధించి జీవించడం కంటే బిక్షమెత్తుకు బ్రతకడం మేలు కదా ! నేను సోదరులైన దృతరాష్ట్ర కుమారులను చంగలనా ! నా హృదయం శోకతప్తమైంది ఇంద్ర పదవి కూడా ఈ శోకాగ్ని చల్లార్చదు . యుద్ధంలో ఎవరు గెలిచినా బంధునాశనం తప్పదు. కార్పణ్య దోషంతో కొట్టబడిన నేను ధర్మా ధర్మ విచక్షణ చేయ లేకున్నాను. నన్ను నీ శిష్యుని చేసుకొని కర్తవ్యాన్ని బోధించు కృష్ణా " అని చేతులు ముకుళించి ప్రార్ధించాడు.

కృష్ణుడు అర్జునినికి ఆత్మజ్ఞానం భోధించుట

శ్రీకృష్ణుడు " అర్జునా ! శోకించ తగని వారి కొరకు శోకిస్తున్నావు. కాని పండితుని వలె మాట్లాడుతున్నావు. పండితులు జీవించి ఉన్న వారిని గురించి కాని మరణించిన వారి గురించి చింతించరు. అవివేకంతో నీవు పడుతున్న వేదన వివేకంతో ఆలోచించిన పటాపంచలు కాగలదు. పరమ జ్ఞానవంతమైన వాక్యములు చెప్తాను విను జీవుడు ఈ లోకమున బాల్యం, యవ్వనం, వార్ధక్యం ఎలాగో మరణానంతరం చిరిగిన వస్త్రం విడిచి కొత్త వస్త్రాన్ని ధరించిన విధంగా జీర్ణ శరీరాన్ని వదిలి వేరొక నూతన శరీరాన్ని ధరిస్తాడు. పుట్టుక మరణం శరీరానికే కాని ఆత్మకు కాదు. ఆత్మను ఖడ్గం ఖండించ లేదు, అగ్ని దహించ లేదు, జలం తడప లేదు, వాయువు ఆర్పివేయనూ లేదు ఆత్మ శాశ్వితుడు, పురాతనుడు మరణం శరీరానికే కాని ఆత్మకు కాదు. ఆత్మ నిర్గుణుడు ఎవరినీ బాధించడు తాను బాధపడడు. సుఖ దుఃఖములకు కారణం అహంకారం కనుక పార్ధా ! నీవు అహంకారమును వదిలి యుద్ధం చేయుము. స్వధర్మం ఆచరణ యోగ్యం పర ధర్మం పాపం. చక్కగా అనుష్టించ బడిన పరధర్మం కంటే లోప భూయిష్టమైన స్వధర్మం మంచిది. అర్జునా ! క్షత్రియులకు యుద్ధం పరమ ధర్మం తెరిచి ఉంచిన స్వర్గదామం. సందేహం వదిలి యుద్ధం చేయ సన్నద్ధిడివి కా . అర్జునా ! మనుష్యుడు కర్మానిని మాత్రమే ఆచరించ వలెను ఫలితాన్ని దైవానికి వదిలి వేయాలి. దీనిని కర్మ సన్యాసం అంటారు. ఇలా కృష్ణుడు అర్జునినికి తత్వజ్ఞానం అందించి అతని సందేహాలను తీర్చాడు.

విచిత్రవీర్యుడు

విచిత్రవీర్యుడు దృతరాష్ట్రుడు మరియు పాండురాజులకు తండ్రి. ఇతని భార్యలు అంబిక, అంబాలిక లు.

వికర్ణుడు

మహాభారతంలో ఉదాత్తమైన పాత్రల గురించి మాట్లాడుకోగానే కర్ణుడి ప్రస్తావన తప్పకుండా వస్తుంది. కానీ వికర్ణుడి పేరు ఎప్పుడైనా విన్నారా? వింటే మీరే అంటారు... కర్ణుడి వ్యక్తిత్వానికి ఏమాత్రం తీసిపోని ఉదాత్తత వికర్ణుడిది అని! వికర్ణుడు ఎవరో కాదు! నూరుగురు కౌరవులలో ఒక్కడు. కానీ అన్యాయం జరిగిన రోజున ఆ ఒక్కడే దుర్యోధనుని ఎదిరించి నిలబడ్డాడు. అలాగని కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల పక్షం వహించాడా అంటే అదీ లేదు. సోదరుని బంధానికి కట్టుబడి కౌరవుల పక్షాన యుద్ధం చేశాడు. ఆ వికర్ణుని కథా కమీమీషు...
వికర్ణుడు అందరు కౌరవులలాగానే హస్తినలో అల్లారుముద్దగా పెరిగాడు. సకల అస్త్ర విద్యలనూ ఔపోసన పట్టాడు. తన సోదరులతో కలిసి భీష్మ, ద్రోణ, కృపాచార్య వంటి అతిరథుల వద్ద యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు. బహుశా అలా నూరుగురిలో ఒక్కరిగా వికర్ణుని కథ సాగిపోయేదేమో! కానీ ద్రౌపదీ వస్త్రాపహరణం సమయానికి అతను వెలుగులో కనిపిస్తాడు. ఆ ఘట్టంలో... పాండవులను కపట జూదంలో ఓడించిన దుర్యోధనుడు అందుకు పణంగా ద్రౌపదిని ఈడ్చుకురమ్మని దుశ్శాసనుని పంపుతాడు. ఆ సందర్భంలో భీష్మ, ద్రోణ వంటి పెద్దలంతా తలవంచుకు ఉండిపోతే... వికర్ణుడు ఒక్కడే అలా చేయడం తప్పంటూ వారిస్తాడు. వారి చర్యల వల్ల కురువంశానికే మచ్చవస్తుందని హెచ్చరిస్తాడు. ఆ సమయంలో వికర్ణుడి నోరుమూయిస్తాడు కర్ణుడు. మా
యాజూదంలో ఓడిపోయిన పాండవులు అరణ్యవాసాన్ని, అజ్ఞాతవాసాన్ని గడపడం; తమ రాజ్యాన్ని తిరిగి ఇవ్వమంటూ కృష్ణుని ద్వారా దుర్యోధనునితో సాగించిన రాయబారం విఫలం కావడం... ఇవన్నీ కూడా కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసే విషయం తెలిసిందే! ధర్మం పాండవుల పక్షాన ఉందని తెలిసినా, తాము ఓడిపోతామని ముందే గ్రహించినా... వికర్ణుడు తన అన్నను అనుసరించడానికే సిద్ధపడతాడు. అలాగని ఏదో తూతూమంత్రంగా యుద్ధం సాగించలేదు వికర్ణుడు. కురుక్షేత్ర సంగ్రామం నడిచిన ప్రతిరోజూ అతని ప్రతిభ మార్మోగుతూనే ఉండేది. వికర్ణుడు అద్భుతమైన విలుకాడు. విలువిద్యలో కర్ణుని తరువాత ఎన్నదగిన యోధుడు. అందుకే భగవద్గీత తొలి అధ్యాయమైన ‘అర్జున విషాదయోగం’లోని ఎనిమిదవ శ్లోకంలో వికర్ణుని ప్రస్తావన వస్తుంది. అందులో...
భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తి స్తథైవ చ ।8।
అని ద్రోణాచార్యులతో అంటాడు దుర్యోధనుడు. ఇందులో ద్రోణాచార్యలు, భీష్ముడు, కర్ణడు, కృపాచార్యడు, అశ్వత్థామ వంటి యోధులంతా తన సరసన ఉన్నారంటూ దుర్యోధనుడు గర్వపడటం కనిపిస్తుంది.

వికర్ణుడు ఎంత గొప్పవాడైనా అతను కౌరవుల పక్షాన పోరాడుతున్నాడు కాబట్టి మృత్యువు తప్పలేదు. కురుక్షేత్ర సంగ్రామంలోని 14వ రోజున వికర్ణుడు భీముని ఎదుర్కొంటాడు. వారిరువురి మధ్యా జరిగిన భీకర యుద్ధంలో వికర్ణుడు ప్రాణాలను విడుస్తాడు. వికర్ణుని మృత్యువుకి భీముని మనసు సైతం భారమైపోయిందంటారు. అసలు ఒక కథనం ప్రకారమైతే భీముడు, వికర్ణునితో యుద్ధం చేసేందుకు ఇష్టపడడు. కానీ క్షాత్ర ధర్మం ప్రకారం పోరాడి తీరవలసిందే అంటూ అతడిని రెచ్చగోడతాడు వికర్ణుడు. అలా తుదివరకూ తను నమ్మిన ధర్మానికి కట్టుబడిన వీరుడు వికర్ణుడు. అందుకే ఇప్పుడిప్పుడే వికర్ణుని గురించిన గాథలు మళ్లీ ప్రచారంలోకి వస్తున్నాయి. గత ఏడాది చింతకింది శ్రీనివాసరావు అనే రచయిత వికర్ణుని గురించి తెలుగులో ఒక పుస్తకాన్ని సైతం తీసుకువచ్చారు.
- నిర్జర.

యమములు: అహింస, సత్యం,అస్తేయం, బ్రహ్మచర్యం మరియు అపరిగ్రహం.


అహింస:
అహింస అంటే మన అంతరంగం నుండి హింసను పూర్తిగా తుడిచిపెట్టడం. ఇతరులకు హాని తలపెట్టాలనే ఆలోచనను కూకటివేళ్ళతో పెకలించటం. ఇతరులకు గాని, మనకు మనంగాని హాని చేకూర్చటం వలన మనం ఏమీ సాధించలేము, ఇతరులకు హానిచేయటం అంటే మనకు మనం హానిచేసుకోవటమే. అహింసకు మరో పేరే ప్రేమ. మనహృధయాలు ప్రేమతో నిండివుంటే హింసాత్మక ఆలోచనలు తలెత్తవు, అటువంటి మానసిక స్థితి యోగ సాధనకు అవసరం.
అన్ని రకాల హింసలను ఆపండి:
హింస వివిధ రకాలుగా పలు ఛాయలలో వుంటుంది, అది శారీరక హింసే కానక్కరలేదు. నిజానికి శారీరక హింస అన్ని ఇతర విధాల హింసల కంటే తక్కువది, కొన్ని రోజులలో అది మానిపోతుంది. మానసిక హింస అన్ని హింసలకంటే కృరమైనది పలు రకాలుగా వుంటుంది. అవి ఏమంటే
కార్యాలయ హింస: ఒక ఉద్యోగికి వాని శక్తికి మించిన పనిని ఇవ్వడం ఒక రకంగా హింసే. దాని పర్యవసానాలు
~ ఉద్యోగి మానసిక వత్తిడి పెరగటం.
~ ఆ వత్తిడి రక్తపోటు, మధుమేహం, మతిమరుపు మొదలగు శారీరక రుగ్మతలకు దారితీయటం.
~ ఆసహనం పెరిగిపోయి గృహజీవిత సమతుల్యాన్ని దేబ్బతీయటం.
~ మరెన్నో.
కనుక యజమానులు ఈ విషయాన్ని అర్ధం చేసికొని, తమవద్ద పనిచేసే ఉద్యోగుల సమర్ధతను మదింపుచేసి తదనుగుణంగా పనిని కేటాయించటం చేయాలి.
మాటలతో హింస: మనమాటలు మనకెప్పుడు మధురంగానే ఉంటాయి, కాని ఇతరులకు అలా కాకపోవచ్చు. ఇతరుల మానసిక స్థితి, అభిరుచి గుర్తించకుండా మననోటికి వచ్చిన అర్ధంపర్ధం లేని వాగుడుతో వాళ్లకి కలిగించే బాధ శారీరక బాధకంటే ఎక్కువే. అలా బాధించాతానికి అవి తిట్లు, శాపనార్ధాలే కానక్కరలేదు.
ఇతరుల మనోభావాలను దెబ్బతీసే మాటలను వాడటం కూడా హింసే.
భయం, ఆందోళన, ఆదుర్దా ఆదిగాగల భావావేశాలను రెచ్చగొట్టే మాటలను వాడటం కూడా హింసే.
మెగాఫోన్లు వంటి సాధనాలను వుపయోగించి తీవ్ర ధ్వనితో శబ్దాలను సృష్టించి మానసిక అశాంతిని కల్గించటం కూడా హింసే, వీటిని విడనాడాలి.
స్వయంకృత హింస: హింస అనేది బయటివారు మనపై చేసేదేకాదు, ఒక్కొక్కసారి మనలను మనమే హింసించుకుంటాం.
జరిగిపోయిన అనర్ధాలు, ఆపత్తులను తలసుకొని విలపించటం, మనపై మనం జాలిపడటం మొదలైనవి మన మెదడుపై చాల ప్రభావం చూపుతాయి, అది కూడా హింసే.
మన శక్తికి మించిన బాధ్యతలు ఒప్పుకోవటం / తీసుకోవటం తద్వారా మనను మనం హింసించుకోవటం. శా
ంతి, సుహృద్భావం, పరస్పర సహకారం, కలిసికట్టుదనం మరియు ప్రేమలతో కూడిన వాతావరణాన్ని ఇంట్లో, కార్యాలయంలో, నివాససముదాయాలలో, సమాజంలో సృష్టించుకోవాలి.
నిన్ను, నీతోటివాన్ని, సమాజాన్ని, ప్రకృతిని, భూమిపై వున్నా ప్రతిదాన్నీ ప్రేమించు, అదే అహింసకు పరిపూర్ణమైన వ్యక్తీకరణ.
-రామ

యోగంలో యమ, నియమాలు


మానవుని మనస్సు చాలా చంచలమైనది. అనేకమైన విషయవాసనలకు లోనై, సంసారబంధాల వెంట పరుగులు పెడుతూ ఉంటుంది. దానివల్ల రాగద్వేషాలు, సుఖదుఃఖాలు, బంధనాలు కలుగుతూ ఉంటాయి. ఇవ్వన్నీ సంసారం పట్ల వ్యామోహానికి కారణమై, మనస్సు వ్యాకులపడుతూ ఉంటుంది. దురదృష్టవశాత్తూ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో కొందరు తాత్కాలిక సుఖాలే శాశ్వతమని భ్రమసి, వాటి కోసమే చేయరానివి చేస్తూ, చేయవలసినవి మానివేస్తూ, తమకే కాకుండా తమ చుట్టూ ఉన్నవారికి, సమాజానికి కూడా నష్టాన్ని తెస్తున్నారు. చాలామందికి నైతికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరాలని ఉన్నా ఏం చేయాలో తెలియక అయోమయ స్థితిలో ఉంటారు. అందువల్ల ప్రతీ ఒక్కరూ మనశ్శాంతికి, స్థిరత్వానికి ఆరాటపడుతూనే ఉంటారు. ఎలా సాధించాలో తెలియక మరింత కలవరపడుతూ ఉంటారు. మానవునికి కావలిసినది భోగం కాదు యోగం అని చెప్తూ మన సనాతనధర్మం ఇలాంటి వారికి ఒక చక్కని మార్గనిర్దేశం చేసింది. మనం అదుపులో ఉంచవలసినవి, నియంత్రించవలసినవి నియంత్రిస్తూ, ప్రయత్నపూర్వకంగా ఆచరించవలసినవి ఆచరిస్తూ ఉంటే, మనఃశ్శాంతితో పాటు ఆధ్యాత్మికోన్నతి కూడా కలుగుతుంది. ఎందఱో దార్శనికులు, మహర్షులు దీనికోసమై అనేక మార్గాలను మనకు సూచించారు.
అందులో పతంజలి మహర్షిచే చెప్పబడిన యోగశాస్త్ర దర్శనం అన్నింటికన్నా సులువైనది, నిత్యమూ అనుష్ఠానం చేయతగ్గది. దర్శనం అంటే వేదంలో చెప్పబడిన విషయాన్ని నిర్ధారించి చెప్పేది.
యోగశాస్త్ర దర్శనం అనగానే నేడు చాలామంది పొరబడుతున్నట్లుగా యోగాసనాలు, ప్రాణాయామము మాత్రమే కాదు, దీనికి అతీతంగా జీవాత్మని పరమాత్మతో అనుసంధానంచేసి, బ్రహ్మానందస్థితిని పొందటమే దాని పరమలక్ష్యం. అదే మోక్షస్థితి. మోక్షము, సాధన అనగానే అదేదో బ్రహ్మపదార్ధమన్నట్లు, కేవలం యోగులు, సిద్ధులు, సాధకులకి మాత్రమే పట్టుబడే విద్య, మనకి కాదు అనుకుని చాలామంది దానికి దూరంగా ఉంటారు. కానీ పతంజలిమహర్షి ప్రతిపాదించిన అష్టాంగ యోగదర్శనం అందరూ నిత్యం ఆచరించదగ్గ, అనుష్ఠానంలోకి తెచ్చుకోదగ్గ దర్శనం. నిత్యమూ ప్రయత్నపూర్వకంగా ఆచరణలోకి తెచ్చుకోవలసినది. అష్టాంగ యోగం(యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి)లో మొదటి రెండు అంగాలైన యమ, నియమములు ఈ భౌతిక ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ సామాజికంగా, వ్యక్తిగతంగా తాము ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగడానికి తోడ్పడేవి. ఇవి నిష్ఠతో పాటిస్తే మిగిలినవి వాటంతట అవే దైవానుగ్రహం వల్ల సమకూరతాయి.
యమ, నియమాల గురించి తెలుసుకుందాం.
🌺 యమము 🌺
యమము అంటే అదుపులో ఉంచవలసినది, నియంత్రించవలసినది. అని అర్ధం. వ్యక్తి సంఘపరమైన నైతికవిలువలు పాటించేలా చేసి, అతణ్ణి సామాజికంగా ఉన్నత స్థానంలో నిలబెడుతుంది.
యమములు ఐదు. 1. అహింస 2. సత్యము 3. అస్తేయము 4. బ్రహ్మచర్యం 5. అపరిగ్రహము
🌹 అహింస – అహింసను ఒక వ్రతంలా పాటించాలి. భౌతికమైన హింసే కాదు, మానసికంగానూ , వాక్కుపరంగానూ కూడా హింసని నిరోధించాలి. శరీరపోషణ కై ప్రకృతిలోని కొన్ని జీవజాతులలోనూ మరియు ధర్మరక్షణకై కొన్ని పరిస్థితులలో మాత్రమే హింసకు అనుమతి ఉంది.
🌹 సత్యము – త్రికరణ శుద్ధియైన ఋజుప్రవర్తన. నీతీ, నిజాయితీ పాటించడం. ఎట్టిపరిస్థితుల్లోనూ సత్యాన్ని విడువకపోవడం.
🌹 అస్తేయము – పరుల సొమ్మును ఆశించకుండా ఉండడం, దొంగతనం చేయకుండా ఉండడం. కనీసం అలాంటి తలంపు కూడా మనసులోకి రాకుండా నిరోధించుకోవాలి. దీన్ని పాటించడం వల్ల మనకు అవసరమైనది, అర్హమైనది ఆ భగవానుడే మనకు సమకూరుస్తాడనే నమ్మకం పెంచుకోవాలి. మనకు కావలసింది ధర్మబద్ధంగా సంపాదించుకోవాలి.
🌹 బ్రహ్మచర్యం – వంశాభివృద్ధి కోసమే దాంపత్యం అని త్రికరణశుద్ధిగా నమ్మి, అది ఒక యజ్ఞంలా భావించాలి. ఏకపత్నీవ్రతుడైన గృహస్థు బ్రహ్మచారే అంటోంది శాస్త్రం.
🌹 అపరిగ్రహం – ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉండటం, దురాశ లేకుండా అవసరమైనంత లేదా ఒక్కోసారి తక్కువగా కూడా గ్రహించడం.
నియమాలు అంటే ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవలసినవి, ఆచరించవలసినవి. ఇది వ్యక్తిగత క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తుంది.
నియమాలు కూడా ఐదు. 1. శౌచము 2. సంతోషము 3. తపస్సు 4. స్వాధ్యాయము 5. ఈశ్వర ప్రణిధానము.
🌻 శౌచము – ఇది ప్రతీ ఒక్కరూ శారీరికంగా, మానసికంగా పాటించవలసినది. దాని వల్ల బాహ్య, అంతఃశుద్ధి జరిగి, ఆరోగ్యం చెంత చేరుతుంది, మనస్సు తేలికగా ఉంటుంది.
🌻 సంతోషము – జీవితంలో కష్టసుఖాలు ఎదురైనప్పటికీ, అవి సహజమే అన్న దృష్టితో ఎల్లప్పుడూ సంతోషాన్ని వీడకూడదు. ప్రయత్నపూర్వకంగానైనా సంతోషంగా ఉండాలి. తనకు లభించిన దానితో తృప్తి చెందటమే సంతోషం.
🌻 తపస్సు – తపస్సు అంటే జనాలకి దూరంగా ఉండి అడవుల్లో చేసేది కాదు. శారీరిక, వాఙ్మయ, మానసికమని మూడు విధాలైన తపస్సులు. పెద్దలు, గురుజనుల సేవ, ఎల్లప్పుడూ సేవాభావంతో ఉండటం, సేవ చేయటం శారీరిక తపస్సు. మన మాటని మృదువుగా, అర్ధవంతంగా, వినసొంపుగా, తగుమాత్రంగా, వినియోగించుకోవడమే వాక్ తపస్సు. మనసు సదా పవిత్ర భావనలతో, పరిశుద్ధంగా ఉంచుకోవడమే మానసికమైన తపస్సు.
🌻 స్వాధ్యాయం – తనకు అధ్యాత్మికోన్నతిని కలిగించే పవిత్ర గ్రంథాలని అధ్యయనం చేస్తూ, ఇష్టదేవతా ప్రార్థన సదా చేస్తూ, తనకు కలిగే సందేహాలను తీర్చుకోవడమే స్వాధ్యాయము.
🌻 ఈశ్వర ప్రణిధానము – మనస్సును దైవానికి శరణాగతి చేయడం, ఆ దైవానికి, ప్రకృతికి అనుగుణంగా ప్రవర్తించడమే ఈశ్వర ప్రణిధానము.
ఈ యమ నియమాలు పదింటినీ నిత్యం అనుష్ఠానం లోకి తెచ్చుకుంటే మానవ జీవితం ఉన్నత పథంలో నిలుస్తుంది. మనస్సు నిర్మలత్వాన్ని, స్థిరత్వాన్ని పొందుతుంది. జీవ, బ్రహ్మ ఏకత్వానికి కావలసిన పునాది పడుతుంది.
🙏🏻🙏🏻 జై శ్రీమన్నారాయణ 🙏🏻🙏🏻