కురుక్షేత్ర సంగ్రామం

మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఒక ప్రముఖ ఘట్టం. ఈ యుద్ధం దాయాదులైన కౌరవులకు పాండవులకు మధ్య హస్తినాపుర సింహాసనం కోసం జరిగింది. ఈ యుద్ధం కురుక్షేత్రం అను ప్రదేశములో జరిగింది. కురుక్షేత్రం ఈనాటి భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో ఉంది. అప్పటి రాజ్యాలన్నీ ఈ యుద్ధంలో పాల్గొన్నాయి.
కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగింది. మహాభారతంలోని భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక పర్వాలలో ఈ యుద్ధం గురించిన వర్ణన ఉంది. భగవద్గీత మహాభారత యుద్ధ ప్రారంభంలో ఆవిర్భవించింది. పాండవవీరుడైన అర్జునుని కోరికపై అతడి రథసారథి శ్రీకృష్ణుడు రథాన్ని రణభూమిలో మోహరించిన రెండుసైన్యాల మధ్యకు తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూసి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని "నా కర్తవ్యమేమి?" అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత.

పూర్వ చరిత్ర

మహాభారత కాలం నాటి భారతదేశం.
మహాభారతం, ఒక అతి ముఖ్యమైన హిందూ పురాణ కథ. ఇది కురు వంశీయుల జీవితాలను, వారి అనేక తరాల రాజ్యాధికారాన్ని మరియు పరిపాలనను తెలుపుతుంది. ఈ గాథ మూలం కురువంశానికి చెందిన రెండు దాయాది కుటుంబాల మధ్య జరిగిన ఒక గొప్ప యుద్ధం. కురుక్షేత్రం, అనగా కురు వంశీయుల స్థలము , ఈ 'కురుక్షేత్ర' యుద్ధానికి రణరంగము. కురుక్షేత్రం ధర్మక్షేత్రం (ధర్మం యొక్క స్థలము ), లేక field of righteousness గా కూడా ప్రసిద్ధి. ఈ స్థలాన్నే యుద్ధానికి ఎంపిక చెయడానికి మహాభారతంలో ఒక కారణం చెప్పబడింది: ’’ఈ నేలపైన పాపము చేసిననూ ఆ పాపము ఆ నేల యొక్క పవిత్రత వలన క్షమింపబడుతుంది.’’
ఈ యుద్ధంలో పాల్గొన్న ప్రధాన వైరి పక్షాలు పాండవులు, కౌరవులు. అన్నదమ్ముల బిడ్డలైన వారి మధ్య వైరానికి కారణం కౌరవాగ్రజుడైన దుర్యోధనుడి ఈర్ష్య, రాజ్యకాంక్ష. జూదము ద్వారా పాండవుల రాజ్యాన్ని గెలుచుకోవాలని అతడు సంకల్పించాడు. శకుని సాయంతో అతడు ఆటను మోసపూరితంగా గెలిచి సోదరులైన పాండవులను పదమూడేళ్ళ పాటు అరణ్యవాసానికి పంపాడు. అరణ్యవాసం తర్వాత దుర్యోధనుడు పాండవుల రాజ్యాన్ని వారికి తిరిగి ఇవ్వడానికి నిరాకరించడం ఈ యుద్ధానికి దారితీసింది.
తమ కుటుంబంలోని పెద్దలైన భీష్ముడు, ధృతరాష్ట్రుడు, ద్రోణుడు, కర్ణుడు, శకుని మొదలైన వారికి యుద్ధమును గూర్చి సమాచారమును అందించి ఒక శాంతియుత ఒప్పందం ద్వారా యుద్ధాన్ని నివారించడంలో తోడ్పడమని శ్రీకృష్ణుని అన్న అయిన బలరాముడు, పాండవులకు సలహా ఇచ్చాడు.[2] ఈ ప్రతిపాదన కౌరవుల చెంత ఉండగానే, పాండవులు వారి యుద్ధ సన్నాహాలు చేసుకోసాగారు. వారు ఇరుగు పొరుగు దేశాల సహాయమును అర్థించసాగారు.

శాంతి ప్రయత్నాలు

శాంతియుత పరిష్కారం కోసం ఇరుపక్షాల మధ్య నాలుగు రాయబారాలు జరిగాయి. అవి:
పాండవుల తరపున ద్రుపద పురోహితుడు: కౌరవుల వద్దకు రాయబారిగా వెళ్ళాడు. రాయబారం విఫలమైంది.
ధృతరాష్ట్రుని పనుపున కౌరవుల రాయబారిగా సంజయుడు: ఉపప్లావ్యంలో ఉన్న పాండవుల వద్దకు రాయబారిగా వెళ్ళాడు. రాయబారం విఫలమైంది.
పాండవుల తరపున శ్రీకృష్ణుడు: ఇది మహాభారత యుద్ధానికి దారితీసిన నిర్ణయాత్మకమైన రాయబారం. సూదిమొన మోపినంత భూమి కూడా పాండవులకు ఈయనని దుర్యోధనుడు తేల్చిచెప్పడంతో రాయబారం విఫలమైంది, యుద్ధం అనివార్యమైంది.
కౌరవుల తరపున శకుని కుమారుడు ఉలూకుడు: సన్నాహాలన్నీ పూర్తై, యుద్ధం మొదలయ్యేందుకు కొద్దిగా ముందు ఈ ప్రయత్నం జరిగింది. నిజానికి ఇది శాంతి రాయబారం కాక, పాండవులను కించపరచేందుకు దుర్యోధనుడు జరిపిన ప్రయత్నం మాత్రమే.

కృష్ణ రాయబారం

శాంతి ప్రయత్నాల్లో ప్రధానమైనది, నిర్ణయాత్మకమైనదీ కృష్ణ రాయబారం. సంజయుడు రాయబారిగా వచ్చినపుడు శ్రీకృష్ణుడు తానే స్వయంగా హస్తినాపురానికి వచ్చి శాంతి ప్రయత్నం చేస్తానని అతడికి చెప్పి పంపించాడు. ఆ ప్రకారమే హస్తినాపురం వెళ్ళి, అక్కడ తన ప్రియ భక్తుడు మరియు ధృతరాష్ట్రుని మంత్రీ అయిన విదురుని ఆతిథ్యాన్ని స్వీకరించాడు. తన ఆహ్వానాన్ని మన్నించి రాజభవనానికి విందుకు రాలేదని ధుర్యోధనుడు అవమానంగా భావించాడు. ఎలాగైనా సరే శాంతి ప్రయత్నాల్ని తిప్పికొట్టాలని, శ్రీకృష్ణుని నిర్భంధించాలనీ అతడు పథకం వేశాడు.
కురుసభలో శ్రీకృష్ణుడు చెప్పిన శాంతివచనాలు వేటినీ దుర్యోధనుడు చెవిన పెట్టలేదు. పాండవులు చెప్పమన్నట్లే కనీసం ఐదు ఊళ్ళైనా ఇవ్వమని చెప్పాడు. ఐదు ఊళ్ళు కాదుగదా, సూదిమొన మోపినంత భూమిని కూడా పాండవులకు ఈయనని దుర్యోధనుడు తేల్చి చెప్పాడు. పైగా శ్రీకృష్ణుని బంధించమని సైనికులను ఆజ్ఞాపించాడు. అతని అజ్ఞానానికి శ్రీకృష్ణుడు నవ్వుకుని ఆ సైనికులందరికీ కంటిచూపు లేకుండా చేసి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఆ స్వరూపాన్ని సభలో ఉన్న భీష్ముడు, ద్రోణుడు, విదురుడు మాత్రమే చూడగలిగారు. చివరి ప్రయత్నం కూడా బెడిసి కొట్టడంతో ధర్మం నిలబెట్టడానికి యుద్ధం అనివార్యమని తెలుపడానికి ఉపప్లావ్యంలో ఉన్న పాండవుల వద్దకు పయనమయ్యాడు.

పాండవ సైన్యం

శాంతి ప్రయత్నాలన్నీ విఫలమైన తర్వాత పాండవులలో అగ్రజుడైన యుధిష్ఠిరుడు తన సోదరులను యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేయవలసిందిగా కోరాడు. మొత్తం పాండవ సైన్యాన్ని ఏడు అక్షౌహిణులుగా విభజించాడు. ఒక్కొక్క అక్షౌహిణికి ద్రుపదుడు, విరాటుడు, ద్రుష్ట్యద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి, చేకితానుడు, భీములను సైన్యాధిపతులుగా నియమించాడు. అందరి సమ్మతితో దృష్ట్యద్యుమ్నుని సర్వసైన్యాధిపతిగా నియమించాడు. అదనంగా కేకయ, పాండ్య, చోళ, కేరళ, మగధ మొదలగు రాజ్యాల సైన్యాలు పాండవుల పక్షాన యుద్ధంలో పాల్గొన్నాయి.

కౌరవ సైన్యం

ధుర్యోధనుడు సర్వసైన్యాధిపత్యం వహించమని భీష్ముని అభ్యర్థిస్తాడు. భీష్ముడు తాను కృతనిశ్చయుడనై యుద్ధము చేస్తాననీ, కానీ తాను పాండవులకు హాని చేయటం గానీ తన గురువు పరశురాముని అవమానించిన కర్ణుని తన సైన్యంలోకి తీసుకోవటం జరగదనే షరతులతో ఆమోదిస్తాడు. పాండవులపై అనురాగంతో, భీష్మ-కర్ణ సమేతమై ధుర్భేధ్యమైన ‍‍‍కౌరవ సైన్యంతో పాండవులు పోరలేరని భీష్ముడు ఇలా నిర్ణయించాడని ఒక భావన. ధుర్యోధనుడీ షరతులనంగీకరించి భీష్ముని సర్వసైన్యాధిపతిగా అభిషేకిస్తాడు. కౌరవసేన పదకొండు అక్షౌహిణులు. సేనలో ధ్రోణాచార్యుడు, అతని కుమారుడు అశ్వత్థామ, కౌరవుల బావమరిది జయధ్రధుడు, కృపాచార్యుడు, కృతవర్మ, శల్య, సుదక్షిణుడు, భూరిశ్రవుడు, బాహ్లికుడు, శకుని మొదలగు మహావీరులు యుద్ధంలో పాల్గొన్నారు. వీరిలో కొందరు ధృతరాష్ట్రుని మీద విశ్వాసంతోను, కొందరు హస్తినాపురము మీద విశ్వాసంతోనూ కౌరవులకు సహాయ పడతారు.

మధ్యస్థులు

విదర్భ రాజు రుక్మి, అతని రాజ్యం మరియు బలరాములు మాత్రమే ఈ యుద్ధంలో మధ్యస్థులుగా ఉన్నారు. [3]
సైన్య విభాగాలు మరియు అస్త్ర శస్త్రాలు (ఆయుధాలు)
పాండవ సైన్యం మొత్తం 7 అక్షౌహిణులయితే కౌరవ సైన్యం 11 అక్షౌహిణులు. 21,870 రథబలం, 21,870 గజబలం, 65,610 అశ్వబలం, మరియూ 109,350 కాల్బలం (పదాతిదళం) కలిపితే ఒక అక్షౌహిణి అవుతుంది. అక్షౌహిణిలో రథ, గజ, అశ్వ, పదాతి దళాలు 1:1:3:5 నిష్పత్తిలో వుంటాయి. ఈ విదంగా ఇరుసైన్యాలలోని బలాలనన్నీ కలిపితే ముప్పై లక్షల తొంభై నాలుగువేల మంది (3094000) అవుతారు. ఒక్కో అక్షౌహిణికీ ఒక్కో సైన్యాదిపతీ, సైన్యంమొత్తానికి సర్వసైన్యాద్యక్షుడు నాయకత్వం వహిస్తారు. భారతయుద్ధంలో 18 కి విశేష ప్రాధాన్యత ఉంది, సైన్యంలో ఏ విభాగాన్ని కూడినా వచ్చేసంఖ్య 18, ఇరు సైన్యాలను కలిపితే 18 అక్షౌహిణులు అవుతాయి. భగవద్గీతలో 18 అధ్యాయాలుంటాయి, యుధ్ధం కూడా 18 రోజులే జరిగింది. ఈ విదముగా 18 సంఖ్య భారతంలో విశిష్టతను సంతరించుకుంది.
కురుక్షేత్రయుద్ధంలో అనేక అయుధాలు వాడారు. భీష్మ, ధ్రోణ, అర్జున, కర్ణ, అభిమన్యు మొదలగు వీరులు ధనుర్బాణాలు, భీమ, ధుర్యోధనులు గదను, ధర్మరాజు, శల్యుడు శూలాన్నీ వాడారు. ఇవికాక కత్తులు, బాకులు మొదలగు ఆయుధాలను కూడా ఉపయోగించారు.
భారతాన్ని చారిత్రక సత్యంగా గుర్తిస్తే, కురుక్షేత్రయుద్ధాన్ని చరిత్రలోనే అత్యంత రక్తపాతం జరిగిన యుద్ధంగా చెప్పవచ్చు. 18 రోజులలోనే ఇరుసైన్యాలలో దాదాపుగా అందరూ మరణిస్తారు. అభిమన్యుని వధకి ప్రతీకారంగా అర్జునుడొక్కడే ఒకే రోజులో ఒక అక్షౌహిణి కౌరవ సైన్యాన్ని హతమార్చాడు. ఈవిదంగా యుద్ధం అసంఖ్యాక విధవలని, అంగవికలురని మిగిల్చి తద్వారా ఆర్థిక మాంధ్యానికి కారణమై కలియుగానికి దారితీసిందని చెప్పవచ్చు.

యుద్ధ వ్యూహాలు

యుద్ధ సమయంలో ఇరు పక్షాలూ తమ తమ సేనలను వివిధ వ్యూహాలలో సమాయత్తం చేసుకొన్నాయి. ఆ రోజు యుద్ధంలో సాధించ దలచిన లక్ష్యానికి అనుగుణంగాను, ఎదుటి పక్షం బలాబలాలను ఎదుర్కోవడానికి వీలుగాను ఈ వ్యూహాలు పన్నినట్లు అనిపిస్తుంది. ఈ వ్యూహాల పేర్లు ఆ వ్యూహాల స్వరూపానికి అనుగుణంగా జంతువులు లేదా వస్తువుల పేర్లతో ఉన్నట్లున్నాయి.[4]
చక్రవ్యూహంలో అభిమన్యుడు ప్రవేశించే చిత్రం రాతిపై శిల్పరూపంలో. వ్యూహ రచన గురించి "డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జున రావు" ఇలా రాశాడు[5] -
విశిష్టమైన సైన్య రచనా పద్ధతిని వ్యూహం అని వ్యూహ శాస్త్రనిపుణులు వివరిస్తారు. తమ సైన్యం తక్కువగాను, ఎదటి సైన్యం ఎక్కువగాను ఉన్నప్పుడు వ్యూహం బాగా ఉపయుక్తమవుతుంది. ఒకవేళ అధికంగా సైన్యం ఉన్నా ఒక కట్టుదిట్టమైన విధానంతో దీన్ని విస్తరింపచేస్తూ తక్కువ ప్రాణనష్టం జరిగేలా, విజయం తమకు దక్కేలా తగినట్లుగా వ్యూహాన్ని నిర్మించుకోవాలి. మహాభారత యుద్ధ సమయంలో క్రౌంచ వ్యూహం, గరుడ వ్యూహం, మకర వ్యూహం, కూర్మవ్యూహం, శకట వ్యూహం, సూచి, శ్యేన, వజ్ర, అచల, సర్వతోభద్ర, మండలార్థ, శృంగాటక ఇలా అనేకానేక రకాల పేర్లతో వ్యూహాలు రూపొందించారు. పశువులు, పక్షుల పేర్లతో రూపొందించే వ్యూహాలు నిజానికి ఆయా పశువులు, పక్షులు తమ శత్రువులతో ఎలా పోరాడితే గెలుస్తున్నాయో అటువంటి స్వభావాన్ని అంతటినీ వ్యూహ రచయిత సంపూర్ణంగా అవగతం చేసుకుంటాడు. అచలం అంటే పర్వతం, అచల వ్యూహమన్నప్పుడు ఒకచోట ఒక క్రమపద్ధతిలో కొండలాగా కదలకుండా సైన్యం ఉండి శత్రువును ఎదుర్కొంటుంది, మకర వ్యూహంలో మకరం అంటే మొసలి, మొసలి నోరుభాగం అతి భయంకరంగా ఉంటుంది. దీన్ని తలపిస్తూ మకర వ్యూహన్ని రూపుదిద్దుతారు. కూర్మం వీపు భాగం ఎంతో గట్టి కవచంలాగా ఉంటుంది. కూర్మవ్యూహం పన్నేటప్పుడు సైన్యంలో ప్రధానమైన వారికి ఎవరికీ దెబ్బతగలకుండా మిగిలిన సైనిక భాగాలన్ని రక్షక కవచంలాగా ఉంటాయి. శ్యేనం అంటే డేగ, డేగ కళ్ళు ఎంతో చురుకుగా ఉంటాయి. ఆ కళ్ళతోటే తనకు కావలసిన పదార్థాన్ని ఎంతో దూరం నుండి చూసి చాకచక్యంగా తన ఆహారాన్ని తన్నుకుపోతుంది. అలాగే శత్రుసైన్యాన్ని చిత్తు చేయటానికి ఈ వ్యూహాన్ని వాడతారు. క్రౌంచ పక్షి ముక్కు చాలా ధృడంగా ఉంటుంది. ఈ వ్యూహంలో ముక్కు భాగంలో ఉండే వారిని జయించటమంటే శత్రువు ఎంతో కష్టానికి గురికావలసి వస్తుంది. వ్యూహాలు పన్నటానికి తగిన సమయం, వాటికి సంబంధించిన విషయాలను శుక్రనీతిలో గమనించవచ్చు. నదులు, అడవులు, దుర్గాలు, తదితర ప్రాంతాలలో తమ సేనకు ఏదైనా ముప్పు వాటిల్లబోతుంది అని సేనాపతి భావించినప్పుడు సందర్భానికి తగిన వ్యూహరచన చెయ్యడం జరుగుతుండేది. సైన్యం ప్రయాణిస్తున్నపుడు అగ్రభాగంలో ఉన్న సైనిక బలానికి ప్రమాదం ఎదురవుతుందన్నప్పుడు మొసలినోరు భాగాన్ని పోలినట్లుగా మకర వ్యూహాన్ని పన్ని శత్రువును చిత్తు చేసేవారు. అవతల శత్రువు కూడా బలంగానే ఉంటే డేగను పోలిన శ్యేన వ్యూహాన్ని పన్నేవారు. శ్యేన వ్యూహం పన్నటానికి ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే సూదిలాగా ముందుకు దూసుకుపోయి శత్రువును నాశనం చెయ్యటానికి సూచీ వ్యూహాన్ని పన్నేవారు. అగ్రభాగాన కాక, వెనుక భాగంలో శత్రువు వల్ల ప్రమాదం కలుగుతుందనుకుంటే శకటం (బండ) లాగా వ్యూహారచన చేసేవారు. ముందూ వెనుకా కాక పక్క భాగాల నుండి ప్రమాదం ముంచుకొస్తుందనుకుంటే వజ్ర వ్యూహాన్ని అలా కూడా కాక నాలుగువైపుల నుండి శత్రువులు దాడి చేయబోతున్నారనుకున్నప్పుడు చక్రవ్యూహమూ భద్రం, వ్యాళం అనే పేర్లున్న వ్యూహాలను కానీ పన్నేవారు. ఈ వ్యూహాలలో కొన్ని శత్రువులను దెబ్బతీయడానికి ఉపయుక్తమయ్యేవిగా ఉండగా, మరికొన్ని తమను తాము కాపాడుకోవటానికి పనికొచ్చేవిగా ఉంటాయి. వ్యూహాలకు అందులో వుండే సైనికులకు ఎప్పటికప్పుడు సూచనలిస్తూ ముందుకు నడవటానికికానీ శత్రువును నిర్భయంగా ఎదుర్కోమని చెప్పటానికి కానీ, వెనక్కి తిరిగి రమ్మనమని చెప్పటానికి కానీ సంబంధిత నాయకులు యుద్ధ సమయంలో ఉపయోగంచే వాద్య పరికరాలను ఉపయోగించటం, రథానికున్న ధ్వజాలు, జెండాలతో సూచనలు చేయడం లాంటివి చేస్తుండేవారు. ఇలా వ్యూహారచనా విన్యాసాలు సమరకళలో ఆనాడు ఎంతో ప్రాధాన్యం వహిస్తుండేవి.

© Copyright శ్రీ భగవధ్గీత