వెనకకు భగవద్గీత ముందుకు
1 అర్జునవిషాద యోగము
||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ప్రథమోऽధ్యాయః - అర్జునవిషాదయోగః

14 వ శ్లోకం

తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యన్దనే స్థితౌ | మాధవః పాణ్డవశ్చైవ దివ్యౌ శఙ్ఖౌ ప్రదధ్మతుః ||1-14|| .

అప్పుడు తెల్లటి గుర్రాలు పూన్చిన గొప్ప రధంలోకూర్చున్న మాధవుడు, అర్జునుడు దివ్యశఖాలను ఊదారు. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు కౌరవుల కోలాహలం చూసి పాండవ సైన్యం రెట్టించిన ఉత్సాహంతో సమరనినాదాలు చేసారు. ఎన్నో రధాలనుండి శంఖనాదాలు మ్రోగించగా ఇక్కడ ప్రత్యేకంగా శ్రీకృష్ణఅర్జునుల రధం గురించి ప్రస్తావించారు. ఈ రధం ఖాండవదహనానికి ధన్యవాదాలు తెలుపుతూ విశ్వకర్మ నిర్మించిన రధాన్ని అగ్నిదేవుడు ముల్లోకాలు జయించమని దీవించి వారికి సమర్పించాడు. ఈ రధానికి మరొక ప్రత్యేకత ఏమిటంటే వైరుల గుండెల్లో దడ పుట్టించే హనుమంతుల వారు ధ్వజం మీద (జండాపై కపిరాజు వలె ) ఆసీనులైఉన్నారు.


కౌరవుల శంఖధ్వనులను విన్నతర్వాత తెల్లనిగుఱ్ఱములను బూనిచిన మహారథముపై ఆసీనువైయున్న కృష్ణార్జునులు తమ దివ్యశంఖములను పూరించిరి.
ఫూర్వము తన ప్రీతి కొఱకు ఖాండవ వనమును దహింపగ,మిక్కిలి ప్రితికతో అగ్నిదేవుడు దివ్యరథమును, గాండీవమగు గొప్ప ధనుస్సును అర్జునునికి కానుకగా ప్రసాదించెను. నాలుగు తెల్లని గుఱ్ఱములను గంధర్వరాజగు చిత్రరథుడు అర్జునిని యుద్ధకుశలతకు,పరాక్రమమునకు మెచ్చి బహూకరించినవి. భూమ్యాకాశములందెచటననను సంచరించగలవు.
అనంత విజయము - ధర్మరాజు
పౌండ్రము - భీముడు
దేవదత్తము - అర్జునుడు
సుఘోష - నకులుడు
మణిపుష్పకము - సహదేవుడు
పాంచజన్యము - శ్రీ కృష్ణుడు పూరించిరి.


ఖాండవ వనము
కృష్ణార్జునులు ఖాండవ వనముకు వెళ్ళుట

ఒకరోజు అర్జునుడు శ్రీకృష్ణునితో " బావా ! ఇక్కడ ఎండలు అధికంగా ఉన్నాయి. మనం వన ప్రాంతాలకు వెళ్ళి కొన్ని రోజులు గడిపి వద్దామా " అడిగాడు. శ్రీకృష్ణుడు అంగీకరించడంతో అందరూ వన ప్రాంతాలకు వెళ్ళారు. వారిద్దరూ విహరిస్తున్న సమయంలో అగ్ని దేవుడు బ్రాహ్మణ వేషంలో అక్కడికి వచ్చాడు. కృష్ణార్జునులు అర్ఘ్యపాద్యాలు ఇచ్చి సత్కరించిన పిమ్మట అతడు " అయ్యా ! బాగా ఆకలి వేస్తుంది. తమరు భోజనం పెట్టగలరా ? " అడిగాడు. అందుకు వారు " విప్రోత్తమా !మీకు ఏది ఇష్టమో చెప్పండి పెడతాము " అన్నారు. అగ్ని దేవుడు నిజస్వరూపం చూపి " కృష్ణార్జునులారా ! నేను అగ్ని దేవుడిని. నేను ఖాండవ వనాన్ని దహించాలి. అందుకు ఇంద్రుడు అడ్డుపడుతున్నాడు. ఇంద్రుడు మిత్రుడు ఆ వనంలో ఉండటమే అందుకు కారణం. ఇంద్రుడు చేసే ఆటంకం తొలగిస్తే నేను ఖాండవ వనాన్ని నిరాటంకంగా భుజిస్తాను " అని అన్నాడు. అర్జునుడు అగ్ని దేవునితో " అయ్యా నీకు ఖాండవ వనాన్ని దహించాలన్న కోరిక ఎందుకు కలిగింది" అని అడిగాడు.
శ్వేతకి యజ్ఞము
అందుకు అగ్ని దేవుడు అర్జునునితో " శ్వేతకి అనే రాజర్షి 100 సంవత్సరాల కాలం సత్ర యాగం చేయ సంకల్పించాడు. అంత దీర్గ కాలం జరపడానికి ఏ ఋత్విక్కు ఒప్పుకోలేదు. శ్వేతకి ఈశ్వరుని కొరకు ఘోరంగా తపస్సు చేసి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు. దేవా నేను నూరు సంవత్సరాల కాలం చేయ సంకల్పించిన సత్ర యాగానికి నువ్వు ఋత్విక్కుగా ఉండాలి " అని కోరుకున్నాడు. అందుకు ఈశ్వరుడు " శ్వేతకీ! యజ్ఞాలు చేయవలసిన బాధ్యత బ్రాహ్మణులది. అందుకని నీకు దుర్వాసుని యాజ్ఞికునిగా నియమిస్తున్నాను. నీవు నూరు సంవత్సరాలు ఎడతెగని నేతి ధారతో యజ్ఞం చేసి అగ్ని దేవుని తృప్తిపరచుము " అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. ఆ ప్రకారం శ్వేతకి చేత నూరు సంవత్సరాలు నిరాఘాటముగా జరిగిన సత్ర యాగంలో త్రాగిన నెయ్యి నాకు అజీర్ణ వ్యాధిని ఇచ్చింది. ఖాండవ వనంలో ఉన్న ఔషధులను దహిస్తే కానీ ఈ వ్యాధి తగ్గదు అని బ్రహ్మ దేవుడు చెప్పాడు. అందుకని ఖాండవ వనాన్ని దహించాలని అనుకుంటున్నాను " అన్నాడు. అర్జునుడూ " అగ్నిదేవా ! నీకు నెను సహాయము చెయ్యాలంటే మాకు ఆయుధాలు కావాలి కదా ! నా వద్ద ప్రస్తుతము ఆయుధాలు లేవు " అనాడు. అగ్ని దేవుడు " అర్జునా ! నికు ఆ చి౦త వలదు . నీకు కావలసిన ఆయుధాలు నేను సమకూరుస్తాను " అని వెంటనే అగ్నిదేవుడు వరుణుని స్మరించగానే వారి ముందు వరుణ దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. అగ్నిదేవుడు " వరుణదేవా ! నీకు బ్రహ్మ దేవుడు ఇచ్చిన ధనస్సు, అమ్ముల పొది, రథం అర్జునినికి ఇచ్చి, చక్రాన్ని, గదని శ్రీ కృష్ణునికి ఇవ్వు" అన్నాడు. వరుణుడు గాండీవమనే ధనస్సును, అక్షయ తుణీరాన్ని, కపిద్వజంతో కూడిన రధాన్ని అర్జునునకు ఇచ్చాడు. అలాగే సుదర్శనం అనే చక్రాయుధాన్ని, కౌమోదకి అనే గధను శ్రీ కృష్ణునికి ఇచ్చాడు. ఆ అయుధాల సహాయంతో రక్షించమని చెప్పి వారి వద్ద అభయం తీసుకుని రెట్టించిన ఉత్సాహంతో ఖాండవ వన్నాన్ని దహించడం మొదలు పెట్టాడు.
ఖాండవ వన దహనము
కృష్ణార్జునులు ఇరువైపులా రక్షణకు నిలబడ్డారు. అడ్డగించిన వన రక్షకులను సంహరించారు. వనంలోని జంతువులు, పక్షులు, పాముల అగ్నిజ్వాలలో పడి మరణించసాగాయి. దేవతల ద్వారా ఇది తెలుసుకున్న ఇంద్రుడు మేఘాలను పిలిచి ఖాడవ వనంపై కుంభవృష్టి కురిపించమని ఆజ్ఞాపించాడు. ఇంద్రుడు కురిపించే కుంభవృష్టి ఖాడవ వనం మీద పడకుండా బాణాలతో ఒక కప్పు నిర్మించాడు. అగ్ని జ్వాలల నుండి రక్షించుకోవడానికి తక్షకుని కుమారుడైన ఆశ్వసేనుడు తల్లి తోక పట్టుకుని ఆకాశంలోకి ఎగిరాడు. ఇది చూసిన అర్జునుడు తన బాణాలతో అశ్వసేనుని కొట్టాడు. అది చూసిన ఇంద్రుడు అర్జునునిపై మోహినీ మాయను ప్రయోగించి అశ్వసేనుని అతని తల్లిని కాపాడాడు. ఇంద్రుడికి అర్జునునికి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. కుమారుని పరాక్రమానికి ఇంద్రునికి సంతోషం కలిగినా తక్షకుని రక్షించడానికి యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఇంతలో ఆకాశవాణి " దేవేంద్రా! వీరు నరనారాయణులు వీరిని జయించడం నీకు సాధ్యం కాదు. తక్షకుడు తప్పించుకుని కురుక్షేత్రం వెళ్ళాడు" అని పలికింది. అది విని ఇంద్రుడు తన సేనలతో దేవలోకానికి వెళ్ళాడు.
ఖాండవ వనము నుండి తప్పించుకున్న వారు
నముచి అనే రాక్షసుని తమ్ముడు గయుడు అర్జునిని శరణుజొచ్చి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఇలా మయుడు, అశ్వపాలుడు, అతని తల్లి, నలుగురు శార్జకులు ప్రాణాలతో తప్పించుకున్నారు. కథ వింటున్న జనమేజయుడు " మహాత్మా ! మంద పాలుడు ఎవరు. వారు ఎలా తప్పించుకున్నారు " అని అడిగాడు. పూర్వం మంద పాలుడనే మహా ముని బ్రహ్మచర్యం అవలంబించాడు. మరణానంతరం కుమారులు లేని కారణంగా పుణ్యలోకాలకు వెళ్ళలేక పోయాడు. ఆ కారణంగా త్వరగా సంతానం పొందడానికి పక్షిగా జన్మించి జరితతో చేరి నలుగురు కుమారులను పొందాడు. వారంతా ఖాండవ వనంలో ఉన్నాడు. అగ్ని దేవుడు ఖాండవ వనాన్ని దహించే ముందు మంద పాలుడు తన
కుమారులను రక్షించమని అగ్నిదేవుడిని ప్రార్ధించాడు. అందుకు అగ్ని దేవుడు అంగీకరించాడు. మంద పాలుడు తన కుమారుల దగ్గర ఉన్నాడు. కుమారులను కలుగులో దాక్కోమని చెప్పాడు. వారు " తండ్రీ ! కలుగులో దాక్కుంటే ఎలుకలు తింటాయి. ఇక్కడ ఉంటే పవిత్రమైన అగ్నికి ఆహుతి కావడం మంచిది కదా " మంద పాలుడు అందుకు అంగీకరించాడు. జరిత పైకి ఎగిరి పోయింది. శార్జకులు వేద పఠనం చేస్తూ రక్షించమని ప్రార్థించాయి. అది విన్న అగ్ని దేవుడు వారు మంద పాలుని కుమారులుగా గుర్తించి ఆ చెట్టుని వదలి వేసాడు. కుమారులు సురక్షితంగా ఉన్నారని తెలుసుకుని మంద పాలుడు పుణ్యలోకాలకు వెళ్ళిపోయాడు. అగ్ని దేవుడు నిర్విఘ్నంగా ఖాండవ వనాన్ని దహించి తన రోగం పోగొట్టుకున్నాడు. కృష్ణార్జునులను దీవించాడు. దేవేంద్రుడు కుమారుని పరాక్రమానికి మెచ్చి అర్జునునికి వారుణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వాయవ్యాస్త్రం ఇచ్చాడు. కృష్ణార్జునులు మయుని వెంట పెట్టుకుని ఇంద్ర ప్రస్థానికి వెళ్ళి ధర్మరాజాదులకు జరిగినది చెప్పి మయుని పరిచయం చేసాడు.


చిత్రరథుడు
భారతం లో చిత్ర రధుని పాత్ర వస్తుంది .అతనికి అంగార పర్ణుడు అనే పేరుంది .గంధర్వ రాజు .కుబేరునికి పరమ మిత్రుడుకూడా .ద్రుపద నగరానికి పాండవులు వెడుతున్నప్పుడు ఒక రోజు రాత్రి ,అతడు తన స్త్రీలతో విహరిస్తుండగా వాళ్ల పాద ధ్వనిని విని ‘’ఎవరుమీరు ?ఎక్కడికి వెడుతున్నారు ?’’ఇది నాకు చెందిన అడవి .నా అనుమతి లేకుండా నిస్సంకోచంగా రాత్రి వేళ సంచరిస్తున్నారు .ఈ అరణ్యం ,ఇక్కడున్న గంగానది అంగార పర్ణుడివి అని మీకు తెలియదా ‘’అనికోపం తో కేకలు వేస్తూ అడిగాడు .అప్పుడు అర్జునుడు ‘’ఈ నదిలో ఎవరు స్నానం చేస్తే వాళ్ళది అవుతు౦ది కాని నీకుగుత్తాదిపత్యం కాదు .సముద్రం, నది, పర్వతాలు, అడవులు ఎవరో ఒక్కరికి చెందినవికావు .సమస్త జనులకు వాటిపై అనుభవించే హక్కు ఉంది .నువ్వు వద్దన్నమాత్రాన మేము వెనక్కి పోతామనుకొన్నావా ?.గంధర్వులంటే భయపడి శక్తిలేని సామాన్య మానవులు పూజిస్తారు కాని వీరులు కాదు . మమ్మల్ని అడ్డగించటానికి , ఆపటానికి నీకు హక్కులేదు .గంగానది దివిజగంగ .పాపాలను క్షాళనం చేస్తుంది .శాశ్వతమైనది .ఆపవిత్ర నదీమ తల్లి పై హక్కు ఉందనటం మూర్ఖత్వం ‘’అని జవాబు ఘాటుగానే ఇచ్చాడు .
తనను ఎదిరించే వాడువచ్చాడన్న కోపం అసూయతో వాడు అర్జునిపై బాణాలు వేసి గాయపర్చాడు .సర్పాస్త్రాన్ని వాడు సంధిస్తే ,అర్జునుడు కూడా వెనువెంటనే శర సంధానం చేసి వాడిని తీవ్రమైన బాణాలతో నొప్పించి అగ్ని అస్త్రం ప్రయోగించాడు .కొంత సేపు ఇద్దరిమధ్య భీకర పోరాటమే జరిగింది .’’శస్త్రాస్త్ర ప్రయోగం తెలిసిన వీరుడిపై ,తెలియని అస్త్రాలు ప్రయోగించటం తెలివి తక్కువ పని, వ్యర్ధం కూడా.అగ్ని తత్త్వం తెలుసుకోకుండా అంగార పర్ణుడు అనే పేరు పెట్టుకొని కులుకుతున్నావు .అంటే అగ్ని హోత్రునికే ద్రోహం చేస్తున్నావు కనుక నువ్వు శిక్షార్హుడవే ‘’అని హెచ్చరించి చెప్పాడు గాండీవి . కాని అంగారపర్ణుడు అర్జునుని ధాటికి నిలవలేక ఓడిపోయాడు . ఫల్గుణుడు ఆ గ౦ధర్వ ని జుట్టుపట్టుకొని ఈడ్చుకొంటూ అన్న ధర్మరాజు పాదాల చెంత పడేశాడు .ఇంతలో విషయం తెలిసిన అంగార పర్ణు ని భార్య గోడుగోడున విలపిస్తూ వచ్చి తనకు పతి భిక్ష పెట్టమని యుదిస్టిరుని వేడుకొన్నది .ఆమె పై జాలిపడి ఆతడిని వదిలేయమని తమ్ముడికి చెప్పాడు . అర్జునుని శౌర్య బలపరాక్రమాలు గ్రహించి మెచ్చుకొన్న అంగార పర్ణుడు ,అప్పటినుంచి తాను అంగార పర్ణుడుగా పిలువబడనని,తన రధం చిత్ర గతులతో నడుస్తుంది కనక చిత్ర రధుడనే పేరు వచ్చిందని దాన్నికూడా అర్జునుడు ధ్వంసం చేశాడుకనుక ఆపేరూ ఇక ఉపయోగించుకోనని చెప్పాడు . అర్జునునితో స్నేహం చేయాలని అభిలషించాడు .అంతేకాదు పార్దుడికి ‘’చాక్షుషి ‘’అనే గ౦ధర్వ విద్య ఉపదేశించాడు . ఈ విద్యను ఇస్తూ అతడు ‘’ మనువు సోముడు అంటే చంద్రునికి బోధించాడు .సోముడు అంతరిక్ష దేవత .అగ్ని పృథ్వి దేవత .ఇంద్రుడు దేవతలకు అధిపతి .చంద్రుడు విశ్వావసు అనే గాంధర్వ రాజుకు ఉపదేశించాడు .విశ్వావసు గంధర్వ రాజు నైననాకు ఆ విద్య నిచ్చాడు .చాక్షుషి విద్యవలన దివి ,భువి అంతరిక్షాలలో దేన్ని చూడాలనుకొంటే దాన్ని, ఏ రూపం లో కావాలంటే ఆ రూపం లో చూడగలుగుతారు ..ఈ విద్య స్వాధీనం కావాలంటే ఆరునెలలు కఠోర అనుష్టానం చేయాలి .ఈ విద్యవలననే మా గంధర్వులు మనుష్యులకంటే ఉత్తమజాతి వారయ్యారు .దేవతలకు సములయ్యారు .’’అని వివరించాడు .
అతేకాడు చిత్ర రధుడు పాండవులకు ఒక్కొక్కరికి 100 వాజీ లు అనే ప్రత్యేక గంధర్వలోకం లో ఉపయోగించే అశ్వాలను ఇచ్చాడు .వీటిని దేవగంధర్వ అశ్వాలు అంటారు .అత్యుత్తమ జాతి గుర్రాలివి .అవి కృశించినా, బలహీనమైనా వాటి వేగం ఏమాత్రమూ తగ్గదని చిత్రరథుడు చెప్పాడు . ఈ వాజీ లు ఏరంగుకావాలంటే ఆ రంగును, యెంత వేగం కావాలంటే అంతవేగం పొందగల ప్రత్యేక లక్షణాలు కల దివ్యాశ్వాలు .యజమాని అనతరంగాన్ని అర్ధం చేసుకొని ప్రవర్తించే ప్రత్యేక లక్షణం వీటిది .గంధర్వులలో ఉత్తమ జాతి వారు దేవతలతో సమానమైనవారు ,కొంచెం తక్కువజాతివారు సామాన్య మానవులతో సమానమై’’ నరులు ‘’అని పిలవబడుతారని చెప్పాడు.
అర్జునుడు అతనికి కృతజ్ఞతలు చెప్పి తనకు చాక్షుషి విద్య , వాజీలు అవసరం లేదని చెప్పాడు .కాని అతడు తనకు ప్రాణభిక్ష పెట్టినందుకు కృతజ్ఞతగా తీసుకోవాల్సిందేనని బ్రతిమిలాడాడు .అర్జునుడు కూడా దీనికి బదులుగా తన అగ్ని అస్త్రాన్ని అతడిచ్చిన వాజీలకు బదులుగా ఇచ్చాడు .పాండుకుమారుల జన్మ రహస్యాలు తనకు తెలుసునని ,వారు యమ ,ఇంద్ర వాయు అశ్వినీ దేవతల వర జన్ములని ,వారి పౌరుష పరాక్రమాలూ తనకు అవగతమేనని చెప్పాడు .గంధర్వులకు రాత్రివేళ పరాక్రమం ఎక్కువ అని ,అర్జునుని బ్రహ్మ చర్యం,ధర్మ వర్తనం వలననే తాను అతని చేతిలో ఓడిపోయానని అన్నాడు .అర్జునుని మాటిమాటికీ ‘’తాపత్యా ‘’అని సంబోధిస్తుంటే ఎందుకు అలా అంటున్నావో చెప్పమని అడిగాడు .అప్పుడు అతడు ‘’దేవలోకం లో తపతి సౌందర్య రాశి .ఆమె చిన్నతనం లోనే ఆమెను వివాహమాడాలని దేవ గాంధర్వ యక్ష రాక్షసులు ఉవ్విళ్ళూ రారు .యుక్త వయసు రానిదే పెళ్లి చేయనని తండ్రి వివస్వుడు అన్నాడు .సంవర్ణు డు అనే అందమైన వినయవిదేయతలు ధర్మపాలన ఉన్న యువ మహారాజు తనకూతురుకు తగిన వరుడు అని నిశ్చయించాడు .అతడు క్షత్రియ కన్యకు బ్రాహ్మణుడికి జన్మించాడు .క్షత్రియ విద్యలలో ఆరితేరినవాడు .నర్మదానదికి ఉత్తర ,దక్షిణభాగాలన్నీ అతని ఏలుబడి ఉన్నాయి .ఒక రోజు వనవిహారం లో తపతి కన బడి అతని మనసు లాగేసింది .ఎవరు నువ్వు అని అడిగేలోపు సిగ్గుతో అదృశ్యమైంది .మళ్ళీకనబడితే గాంధర్వ వివాహం చేసుకొందామని అంటే ఆమె తాను తండ్రి సంరక్షణలో ఉన్నానని ఆయన అనుమతి అవసరమని చెప్పింది .
తపతిపై గాఢ ప్రేమలో పడి ,అదే ధ్యాసగా ఉన్న అతడిని వశిస్టమహర్షి కలిసి ఉపాయంగా తపతిని అతనికి పెళ్లి చేసి రాజ్యపాలన మంత్రికి అప్పగింప జేసి , నర్మదానది పర్వతాలలపై విహరి౦చమన్నాడు .కాని రాజ్యం లో 12 ఏళ్ళు వర్షాలు లేక కరువుకాటకాలేర్పడ్డాయి ..అప్పుడు మహర్షి ,నూతన దంపతులను రాజ్యానికి రమ్మని కోరాడు .వారురావటం తో వర్షాలు కురిసి భువి సస్య శ్యామలమైంది .సంవర్ణ ,తపతుల కుమారుడే కురు అంటే మీ వంశ పూర్వీకుడు .అందుకే నిన్ను తాపత్యా అన్నాను ‘’అని వివరంగా చెప్పాడు అర్జునునికి చిత్ర రధుడు .తన పూర్వీకుని వృత్తాంతం సవిస్తరంగా తెలియ జేసినందుకు కృతజ్ఞత తెలిపాడు .
చిత్ర రథుడు ధర్మరాజుతో లోక హితము ,ధర్మ సూక్ష్మాలు తెలియ జెప్పే పురోహితుని ఏర్పాటు చేసుకో మని సూచించాడు .అలాంటి వారెవరున్నారని అడిగితే ‘’ధౌమ్యుడు ‘’ఉత్తమజాతిబ్రాహ్మణుడ ని ఆయనను పురోహితునిగా చేసుకోమని సలహా ఇచ్చాడు .కనుక సకల ధర్మ శాస్త్రాలు తెలిసిన నీతి కోవిదుడు గా చిత్ర రధుడు మనకు కన్పిస్తాడు .గ౦ధర్వ రాజులలో ఇంతటి బుద్ధి సూక్ష్మత ఉన్న వారులేరు .కనుకనే శ్రీ కృష్ణుడు ‘’గంధర్వాణా౦ చిత్రరదః ‘’అని నొక్కి వక్కాణించాడు .’’ఇంట లెక్ట్’’ ఎక్కడ ఉంటే పరమాత్మ అక్కడ ఉంటాడుకదా .
రామాయణం లో ఒక చిత్ర రథుడున్నాడు .ఈయన దివి రథుని కుమారుడు .ధర్మ రధుని పుత్రుడు .ఇతని మొదటి పేరు చిత్రరథుడు .అంగ దేశ రాజు .ఇతడినే రోమపాదుడు అంటారు దశరధమహారాజుకు మంచి మిత్రుడు .దశరధుడు తనకూతురు శాంతను రోమపాదునికిచ్చి వివాహం చేశాడు .చాలాకాల౦ సంతానం లేకపోవటం తో దానధర్మాలు విరివిగా చేశాడు భార్యతోకలిసి .ఒకసారి ఒక బ్రాహ్మణుడు దానం పుచ్చుకొని, ఇంటికి వెళ్లి కొడుకును కూడా తెచ్చి అతడికి ఆవును దానం ఇమ్మని కోరాడు. బ్రాహ్మణుడి ఆశాపాతాన్ని చూసి రోమపాదుడు నవ్వగా ఆయన రాజ్యంలో అనావృస్టి కలగాలని శపించాడు .బ్రాహ్మణ అవమానానికి విప్రులు దేశంవదిలి వెళ్ళిపోయారు . అంగ దేశం అనా వృష్టి తో కుంగిపోయింది .ఏరకమైన కల్మష కాపట్యాలు లేని బ్రహ్మచారి అయిన ఋష్యశృంగుడు వస్తేనే వర్షాలు పడతాయని గ్రహించి ఆయన్ను తీసుకురావటానికి వేశ్యలను పంపాడు .ఆడవాళ్ళు అనే వారు ఉంటారని అస్సలు తెలియని ఆయన ,వాళ్ల ఆకర్షణకు లోనై వాళ్ళతో వెళ్ళగా సు వృష్టి కురిసి పంటలుబాగా పండి కరువు నశించింది .రోమపాదుడికి సంతానం కలగటానికి ఋష్యశృంగుడు ఇంద్రుని గూర్చి ఇష్టి నిర్వహించాడు .చతురంగుడు అనే కుమారుడు పుట్టాడు .
కురు కుమారులలో ఒక చిత్ర రథుడున్నాడు .అంగరాజు. చిత్ర రధుని భార్య ,దేవ శర్మ అనే బ్రాహ్మణుడి భార్య అక్కా చెల్లెళ్ళు .మరో చిత్రరథుడు లక్ష మంది భార్యలున్న ఒక రాజు శశి బిందుని కొడుకు .ఒక్కోపెళ్ళానికి అనేకమంది కొడుకులు .
ఇందరిలో చుక్కల్లో చంద్రుడు అర్జునునికి చాక్షుషి విద్యనూ వాజీ లను ఇచ్చిన అంగార పర్ణ చిత్ర రధుడే మనకు కావలసినవాడు కదా

చిత్రాంగదుడు

చిత్రాంగదుడు శంతనుడు మరియు సత్యవతిల మొదటి కుమారుడు.
విచిత్రవీర్యుడు ఇతని తమ్ముడు. భీష్ముడు శంతనుడు మరియు గంగలకు కలిగిన కుమారుడు. భీష్ముడు తన శపధం మేరకు చిత్రాంగదుని హస్తినాపుర సింహాసనానికి పట్టాభిషిక్తుని చేసాడు. చిత్రాంగదుడు బలవంతుడనని గర్వము కలవాడు. అదే పేరు కలిగిన ఒక గంధర్వ రాజు చిత్రాంగదుని యుద్ధమునకు పిలిచాడు. ఆ యుద్ధములో గంధర్వ రాజు చిత్రాంగదుని చంపాడు. చిత్రాంగదుని మరణం తరువాత భీష్ముడు విచిత్రవీర్యుని పట్టాభిషిక్తుని చేసాడు.

అంబ

హోత్రవాహనుడు అనే కాశీరాజు పెద్ద కూతురు అంబ. ఈమెకు అంబిక, అంబాలిక అని ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. అంబ సాళ్వుడిని ప్రేమించి అతనినే పెళ్ళి చేసుకోవాలనుకుంది. కానీ, భీష్ముడు తన తమ్ములకు పెళ్ళి చేయడానికి ఈ సోదరీమణులు ముగ్గురినీ స్వయంవరం వేళ తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు భీష్ముడితో అంబ తన కథ చెప్పి తనని సాళ్వుడి వద్దకు పంపమని కోరింది. భీష్ముడు ఒప్పుకుని ఆమెని పంపేశాడు. కానీ, అక్కడ సాళ్వుడు భీష్ముడు వదిలేసిన అంబని స్వీకరించడానికి ఇష్టపడకపోవడంతో ఆమె తన కష్టాలకి భీష్ముడే కారణమని అతన్ని యుద్ధంలో ఓడించడానికి తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై ఆమెకి రాబోయే జన్మలో దృపదరాజుకు శిఖండి అను కుమారుడిగా పుట్టి భీష్మునికి మరణం కలిగిస్తావని వరమిచ్చాడు. దానితో అంబ వెంటనే చితిపేర్చి శరీరము దహించుకొనింది.
వృత్తాంతము
2. కాశిరాజు కూఁతురు. ఈమెకన్యగా ఉండునపుడు తండ్రియగు కాశిరాజుచే స్వయంవరమున సాల్వునకు ఈయంబడియుండినను భీష్ముఁడు బలాత్కారమున ఈమెను ఈమె చెలియండ్రగు అంబికాంబాలికలను యుద్ధమునందు శత్రురాజునందఱను ఓడించి తెచ్చి తన తమ్ముఁడగు విచిత్రవీర్యునకు వివాహము చేయఁబోవునెడ ధర్మశాస్త్రజ్ఞులు అంబ పూర్వమే తండ్రిచే దత్త అయినందున ఆమెను మరల వివాహమగుట ధర్మువు గాదని చెప్పఁగా ఆమెను భీష్ముఁడు సాల్వరాజునొద్దకు పంప సాల్వరాజును తన్ను పెళ్ళియాడనని ధిక్కరించినందున ఆమె చచ్చి రెండవ జన్మమున శిఖండిగ ద్రుపదరాజునకు పుట్టి భీష్ముని భారతయుద్ధమున పడనేసెను.

అంబాలిక

అంబాలిక మహాభారతంలోని పాత్ర. ఆమె విచిత్ర వీర్యుని భార్య. పాండురాజు తల్లి.
అంబాలిక కాశీరాజు కుమార్తె. అంబ, అంబిక ఈమెకు అక్కలు. వీరి వివాహం కోసం కాశీరాజు స్వయంవరం ప్రకటించగా అనేకమంది రాజులు పోటీపడ్డారు, వారందరినీ భీష్ముడు ఓడించి, యువరాణులు ముగ్గురినీ ఎత్తుకు వెళ్ళాడు. అంబ సాళ్వరాజును ప్రేమించానని చెప్పడంతో భీష్ముడు ఆమెను అతడి వద్దకు పంపించేసాడు. అంబిక, అంబాలికలను తన తమ్ముడైన విచిత్రవీర్యునికిచ్చి వివాహం చేసాడు.
విచిత్ర వీర్యుడు క్షయరోగంతో నిస్సంతుగా మరణించాడు. వంశవృద్ధి కోసమని అతడి తల్లి సత్యవతి తన తొలిపుత్రుడైన వ్యాసుని కోరింది. అంబిక, అంబాలికలకు సంతానాన్ని ప్రసాదించేందుకు అతడు అంగీకరించాడు.
అంబాలిక వ్యాసుని చూడడంతోనే భయంతో తెల్లబారింది. ఆ కారణాన ఆమెకు, పాండురోగం కారణాన తెల్లబారిపోయిన చర్మంతో పాండురాజు పుట్టాడు.

శిఖండి

శిఖండి మహాభారతంలో ఒక పాత్ర. మహాభారత యుద్ధంలో భీష్ముని అస్త్రనస్యాసానికి కారణమైన పాత్ర.

శిఖండి పూర్వ జన్మ వృత్తాంతం

కాశీరాజు తన ముగ్గురు కూతుళ్ళు. అయిన అంబ, అంబిక, అంబాలికలకు స్వయంవరం ప్రకటించగా, భీష్ముడు తన తమ్ముడికి పెళ్ళి చేయాలనుకుని ఆ స్వయంవరానికి విచ్చేసాడు. స్వయంవరానికి వచ్చిన వారి మధ్య కలహాలు చెలరేగాయి. అపుడు భీష్ముడు అందరిని ఓడించి ఆ ముగ్గురు రాజకుమార్తెలను హస్తినాపురం తీసుకువచ్చి పెళ్ళి ఏర్పాట్లు చేయమన్నాడు.

అంబ వేడుకోలు

అపుడు అంబ భీష్ముడి దగ్గరకు వచ్చి "గాంగేయా! నా మనసంతా సాళ్వభూపతి మీద ఉంది. అతనే నా ప్రాణనాయకుడు. మనసు లేని మనువు క్షేమం కాదు. నన్ను సాళ్వుని దగ్గరకు చేర్చు, నా చెల్లెల్లిద్దరిని నీ తమ్ముడికిచ్చి పెళ్లిచేయ్యి" అని వేడుకుంది. భీష్ముడు సరేనని అంబని సాళ్వదేశానికి పంపాడు

అంబ శపథం

సాళ్వుడు అంబని చేసుకోడానికి నిరాకరించాడు. "నువ్వంటే ఇష్టం ఉన్నా, వేరొకరు చేజిక్కించుకున్న విజయఫలాన్ని నేను అందుకోలేను" అని పరుషంగా వెళ్లిపొమ్మన్నాడు. తిరిగి హస్తిన కొచ్చిన అంబని భీష్ముడు కూడా నిరాకరించాడు. అపుడు అంబ నీ వలననే నా ఆశలన్ని నేలరాలాయి. నీపై నేను ప్రతీకారం తీర్చుకుంటాను నిన్ను నేనే సంహరిస్తాను అని శపథం చేసింది. "అంబా! నువ్వు ఏనాడూ ఐతే అస్త్రం చేతపూని నా ఎదుట నిల్చెదవో అపుడు నేను అస్త్రసన్యాసం చేస్తాను" అని భీష్ముడు కూడా ప్రతిన పూనాడు .

పరశురాముడి సహాయం

తన కూతురిబిడ్డ ఐన అంబ విషయం తెలుసుకున్న హోత్రవాహనుడనే రాజర్షి తనను చూసేందుకు వచ్చిన పరశురాముడికి చెప్పి సహాయం చేయమని అడిగాడు. తన తపశ్శక్తితో ఒక వరమాలను చేసి "అంబా ఈ మాల ధరించిన వారి చేతిలోనే భీష్ముడి ఓటమి, తప్పదు". ఇదే నీకు చేయగల సహాయం అని చెప్పాడు. ఆ వరమాల ధరించే వారికోసం అంబ ఎందరినో అడిగి లేదనిపించుకొని చివరకు ద్రుపదుడిని మాల ధరించి భీష్ముడిని ఎదిరించమని వేడుకుంది. ద్రుపదుడు అందుకు ఒప్పుకొనక పోయేసరికి విసిగి కోపంతో ఆ వరమాలను కోటగుమ్మానికి వేలాడదీసి వెళ్ళిపోయి, ఆత్మాహుతి చేసుకుంది.

శిఖండి జననం

ద్రుపదుడు సంతానం కోసం యాగం చేయగా అతనికి ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు జన్మించారు. అందులో మొదటి సంతానంగా (పూర్వజన్మలోఅంబ) ఆడపిల్లగా జన్మించింది. అంబ అక్కడ కోటగుమ్మానికి ఉన్న వరమాలను తీసి తన మెడలో వేసుకుంది. అది చూసిన ద్రుపదుడు కోపోద్రేకంతో "భీష్ముడితో వైరమా!" అని అంబని తన రాజ్యం నుంచి వెళ్ళకొట్టాడు.

శిఖండి ప్రతిజ్ఞ

అంబ తన ప్రతిజ్ఞ నేరవేరడంకోసం శివుడికోసం తపస్సుచేసి పురుషుడిగా మారింది. ఆ అంబనే "శిఖండి". మహాభారత యుద్ధంలో అర్జునుడిరథం ముందుభాగంలో శిఖండి అస్త్రం చేతబూని ఉండడం చూడగానే భీష్ముడు తన చేతిలోని అస్త్రం జారవిడిచాడు. అదను చూసి అర్జునుడు భీష్ముడిని హతమార్చాడు. ఆ విధంగా శిఖండి (అంబ) తన ప్రతిజ్ఞ నెరవేర్చుకుంది.
కురుక్షేత్ర సంగ్రామం

హాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఒక ప్రముఖ ఘట్టం. ఈ యుద్ధం దాయాదులైన కౌరవులకు పాండవులకు మధ్య హస్తినాపుర సింహాసనం కోసం జరిగింది. ఈ యుద్ధం కురుక్షేత్రం అను ప్రదేశములో జరిగింది. కురుక్షేత్రం ఈనాటి భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో ఉంది. అప్పటి రాజ్యాలన్నీ ఈ యుద్ధంలో పాల్గొన్నాయి.  కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగింది. మహాభారతంలోని భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక పర్వాలలో ఈ యుద్ధం గురించిన వర్ణన ఉంది. భగవద్గీత మహాభారత యుద్ధ ప్రారంభంలో ఆవిర్భవించింది. పాండవవీరుడైన అర్జునుని కోరికపై అతడి రథసారథి శ్రీకృష్ణుడు రథాన్ని రణభూమిలో మోహరించిన రెండుసైన్యాల మధ్యకు తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూసి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని "నా కర్తవ్యమేమి?" అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత.     ఇక్కడ నొక్కండి