వెనకకు భగవద్గీత ముందుకు

1 అర్జునవిషాద యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ప్రథమోऽధ్యాయః - అర్జునవిషాదయోగః

5 వ శ్లోకం

ధృష్టకేతుశ్చేకితానః కాశిరాజశ్చ వీర్యవాన్ |
పురుజిత్కున్తిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ||1-5|| .

దృష్టకేతువు, చేకితానుడు, వీర్యవంతుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్టుడైన శైబ్యుడు ఉన్నారు.బలవంతుడు అన్న పదం వీర్యవాన్ గా శిశుపాలుని కొడుకు దృష్టకేతుకు, చేకితనునికి, కాశీరాజుకు వాడారు. ఎన్నో యుద్ధాలు గెలిచిన కుంతీభోజుని పురుజిత్ అని, మానవులలో గొప్పవాడని నరపుంగవుడు అని శైబ్యుని వర్ణిస్తున్నారు. వీరంతా కూడా భీమార్జునులకు సములు అని చెబుతున్నారు.

రాబోయే పెను విపత్తు భయానికి, పాండవులు సమీకరించిన సైన్యం, ఉన్న దానికన్నా చాలాఎక్కువగా అనిపించింది, దుర్యోధనుడికి. తన ఆందోళన ని వ్యక్తం చేస్తూ, పాండవుల పక్షంలో నున్నమహారథుల (పదివేల సాధారణ యోధుల బలంతో సమానమైన యోధులు) ను చూపాడు. పాండవ పక్షం లో వున్న గొప్ప నాయకులను దుర్యోధనుడు పేర్కొన్నాడు. వీరందరూ భీమార్జునులతో సమానమైన యోధులు మరియు యుద్ధంలో గట్టి పోటీ ఇచ్చేవారే.

|| మధ్యమార్గమును అవలంబించుము ||


లక్ష్యమును త్వరితముగ చేరవలెనను అభిలాష మంచిదేకాని, ఆ తొందరలో కాళ్ళు విఱుగగొట్టుకొనకూడదు. మనస్సు నిబ్బరముగ నుండవలెను. సాధనయందు గంభీరత్వము గోచరించవలెను. 'Slow and steady wins the race - శాంతముగ స్థిరబుద్ధితో ప్రవర్తించువాడే పందెమును గెలుచుకొనును' - అని నానుడి వచించుచున్నది. 'అతి సర్వత్ర వర్జయేత్' - అనియు పెద్దలు పలుకుచున్నారు. కావుననే శ్రీకృష్ణపరమాత్మ గీతయందు సాధకుల నుద్దేశించి 'అధికముగ భుజింపవలదు, ఏమియు భుజించకను ఉండరాదు; అధికముగ నిద్రించరాదు, నిద్రలేకను ఉండరాదు. మితాహారము, మితనిద్ర, మితాచరణ కలిగియుండుడు. అత్తఱి యోగము చక్కగ జరుగును' అని కరుణతో నాదేశించిరి. ఏ వస్తువైనను జాగ్రత్తగ వినియోగించుకొనినచో చాలాకాలము పనిచేయును. మితిమీరి వాడివేసినచో త్వరలోనే చెడిపోవును. అట్లే దేహము, ఇంద్రియములు, మనస్సు అనువానిని భగవానుడు మనకు ప్రసాదించిరి. వానిని సదుపయోగపఱచుకొని వానిద్వారా భవసాగరమును దాటివేయవలసియున్నది. భగవద్దత్తములగు ఆ భవసాగరనౌకలను కడు జాగురూకతతో కాపాడుకొనుటకు బదులు వానికి శక్తినిమించిన పనియిచ్చినచో ఆ నౌకలు నడిసముద్రముననే మనలను ముంచివేయును. మఱియు యోగమునకు బదులు రోగమును తెచ్చిపెట్టును. ఎందఱో సాధకులు ప్రాణాయామాదులను, అవసరమైనదానికంటె ఎక్కువగజేసి, శుష్కోపవాసాదులచే దేహమును కృశింపజేసి, అటు పరమార్థమునకుగాని, ఇటు లోకమునకుగాని పనికిరాక 'రెంటికి చెడ్డ రేవడు' ల వలె తయారగుచున్నారు. అట్టివారి జీవితము భ్రష్టమై పోవుచున్నది. ఇదియంతయు గమనించియే గీతాచార్యులు సాధనయందు 'మధ్యమార్గము'ను సూచించిరి. కాబట్టి ముముక్షువులు తమ తమ సాధనలయందు అతిజాగరూకులై 'శనైః శనైః ' అని భగవానుడు చెప్పినట్లు శాంతముగ, గంభీరముగ ప్రవర్తించుచు, మధ్యమమార్గమును జేబట్టి విజయమును కైవసమొనర్చుకొనవలయును.