వెనకకు భగవద్గీత ముందుకు

1 అర్జునవిషాద యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ప్రథమోऽధ్యాయః - అర్జునవిషాదయోగః

9 వ శ్లోకం

అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః |
నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ||1-9|| .

ఇంకా ఎందరో యుద్ధకోవిదులైన శూరులూ, నానా శస్త్రాలను ధరించి నాకోసం జీవితాలని త్యాగం చేశారు. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది.
రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు
మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు శూరులైన భీష్ముడు, కర్ణుడు, మీరు, కృపుడు, అశ్వథ్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు మాత్రమె కాక లెక్కలేనంత మంది వైరి వారి స్థాయికి తగ్గ వీరులున్నారు మనవైపు. బహవ: అన్న పదం ద్వారా జయద్రధుడు, కృతవర్మ, శల్యుడు ఇలా ఎందరో తమ జీవితాల్ని నాకోసం పణంగా పెట్టి యుద్ధానికి వచ్చారు. వారికి “నానా శస్త్రప్రహారః” అంటే ఎన్నో అస్త్రశస్త్రాలను ఉపయోగించే సామర్ధ్యం, శక్తి వున్నవారు, అలాగే “యుద్ధవిశారద:”, అంటే యుద్ధం ఎలా చెయ్యాలో అన్న కౌశలం కలవారు. వీరంతా నా మీద ప్రేమతో, భక్తితో, తమను తాము ఒడ్డి మనకోసం విజయం చేకూర్చకలవాళ్ళు

ఇంకను చాలా మంది గొప్పవీరులు,శూరులునైనవారు మన సైన్యమందు కలరు.వీరు యుద్ధవిశారదులు,వివిధ శస్త్రాస్త్ర సంపన్నులు,అట్టి వీరు నాకొరకు తమ జీవితములను ధారబోయుటకు వచ్చిచేరిన మహాయోధులు.

ఉపనిషత్తు


హిందూ ధర్మ శాస్త్రాలలో ఉపనిషత్తులు ఒక భాగము. వేదముల చివరిభాగములే ఉపనిషత్తులు. ప్రతి వేదంలోను నాలుగు భాగాలున్నాయి. అవి
సంహితలు - మంత్ర భాగం, స్తోత్రాలు, ఆవాహనలు
బ్రాహ్మణాలు - సంహితలోని మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేది. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు.
అరణ్యకాలు - వివిధ కర్మ, యజ్ఞ కార్యముల అంతరార్ధాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణాలకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రస్తావిస్తాయి.
ఉపనిషత్తులు - ఇవి పూర్తిగా జ్ఞానకాండ. ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. నాలుగు వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వేదముల శాఖలు అనేకములు ఉన్నందున ఉపనిషత్తులు కూడా అనేకములు ఉన్నాయి. వాటిలో 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి. వాటిల్లో 10 ఉపనిషత్తులు మరింత ప్రధానమైనవి. వీటినే దశోపనిషత్తులు అంటారు. వేద సాంప్రదాయంలో దశోపనిషత్తులు పరమ ప్రమాణములు గనుక ఆచార్యులు తమ తత్వ బోధనలలో మాటిమాటికిని ఉపనిషత్తులను ఉదహరించారు.

వ్యుత్పత్తి


ఉప +ని + షత్
ఉప అంటే సమీపంగా, ని అంటే కింద, షత అంటే కూర్చునుట
ఉపనిషత్తులు జ్ఞానం ప్రధానంగా ఉన్నాయి. గురువు ముందు శిష్యుడు కూర్చొని జ్ఞానాన్ని ఆర్జించాడు. వీటిలో ప్రధానంగా విశ్వాంతరాళంలో మనిషికి ఉండే స్థానం గురించి చర్చ జరిగింది. ఉపనిషత్తులు తాత్త్విక గ్రంధాలు. ఆత్మ-అంతరాత్మ ప్రపంచానికి మూలం. ప్రకృతి రహస్యాలు మొదలైన వాటి గురించి ఇవి చర్చించాయి. వేదకాలం నాటి ఆలోచన ధోరణికి ఉపనిషత్తులు పరిపూర్ణతను కలిగించాయి. సరైన జ్ఞానానికి, సన్మార్గానికి ఇవి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చాయి. ఉపనిషత్తులు 108 వరకు ఉన్నా అందులో 12 అతి ముఖ్యమైనవి. వేద సాహిత్యం అంతిమ దశలో ఆవర్భవించాయి కాబట్టి వీటిని 'వేదాంతాలు ' అని కూడా అంటారు. ఋగ్వేదయుగాన్ని తొలివేదయుగమని పిలుస్తారు. మిగిలిన సాహిత్యం-వేదాలు, బ్రహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు వెలువడిన యుగాన్ని మలివేద యుగమని అంటారు. తొలి వేదాయుగానికి, మలివేదయుగానికి మధ్య ఎన్నో మార్పులు సంభవించాయి.
ఉపనిషత్తుల అనేక మంది రచయితలకు ఆపాదించబడ్డాయి మరియు వారి పేరు మీద చేయబడ్డాయి: అవి యాజ్ఞవల్క, ఉద్దాలక మరియు అరుణి అనేవి ప్రారంభ ఉపనిషత్తులు ప్రముఖంగా కనిపిస్తాయి. ఇతర ముఖ్యమైన రచయితలు శ్వేతకేతు, శాండిల్య, ఐతరేయ, పిప్పలాద మరియు సనత్కుమార పేరు మీద ఉన్నాయి. ఇంకనూ చర్చించు, తర్కించు, విచారించు, వివేచించు వారు అయిన గార్గి, మరియు యాజ్ఞవల్క భార్య మైత్రేయి ముఖ్యమైన మహిళలు పేరు మీద కూడా ఉన్నాయి.
మొఘల్ చక్రవర్తి షాజహాన్ కుమారుడు, దారా షిఖ్, 1657 లో. పెర్షియన్ భాష లోకి 50 ఉపనిషత్తులు అనువాదం చేయడము జరిగింది.
ఉపనిషత్తులులో ఎక్కువగా బ్రాహ్మణాలు మరియు అరణ్యకములు యొక్క ముగింపు భాగం లోనివి.
భగవద్గీత, ఉపనిషత్తులు మరియు బ్రహ్మసూత్రములును ప్రస్థానత్రయం అంటారు.

అర్థము

వేదాల చివరి బాగాలు. గ్రంథ ప్రతిపాద్యమగు విద్య అని శ్రుతి వచనం. బ్రహ్మవిద్య అని కూడా ఉపనిషత్తులకు మరో పేరు. ఇది ద్వివిధం. 1. పరావిద్య, 2. అపరా విద్య

భూరిశ్రవుడు

భూరిశ్రవుడు ఇప్పటి పర్షియాలోని బాహ్లిక రాజ్యానికి యువరాజు. ఇతను కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల పక్షాన ఒక అక్షౌహిణికి అధిపతియై పోరాడాడు. ఆ యుద్ధంలో సాత్యకి చేతిలో మరణించాడు.
భూరిశ్రవుని తండ్రి సోమదత్తుడు. కృష్ణుని తల్లి అయిన దేవకి వివాహము చేసికొనక ముందు ఆమె కొరకు చాలా మంది రాజులు పోటీ పడ్డారు. వాసుదేవుని కొరకు ఆ యుద్ధములో పాల్గొన్న మరొక రాజు శైని సోమదత్తుని ఓడించాడు. ఈ సంఘటన వల్ల శైని మరియు సోమదత్తుని కుటుంబముల మధ్య వైరం జనించింది.
కురుక్షేత్ర సంగ్రామ సమయంలో శైని మనుమడైన సాత్యకి పాండవుల పక్షాన, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు కౌరవుల పక్షాన యుద్ధంలో పాల్గొన్నారు.
కురుక్షేత్ర సంగ్రామంలో పదునాల్గవ రోజున అప్పటికే బాగా అలసియున్న సాత్యకితో భూరిశ్రవుడు యుద్ధం చేసాడు. చాలాసేపటి తరువాత ఆ యుద్ధంలో సాత్యకి అలసిపోయాడు. భూరిశ్రవుడు సాత్యకిని బాగా గాయపరిచి యుద్ధస్థలమునందు జుట్టు పట్టుకుని ఈడ్చాడు. కృష్ణుడు అర్జునునితో జరుగుతున్న పోరాటము గురించి వివరించి సాత్యకి ప్రాణములకు గల ముప్పు గురించి హెచ్చరించాడు. భూరిశ్రవుడు సాత్యకిని సంహరించుటకు తన ఖడ్గము పైకి ఎత్తాడు. అంతలో అర్జునుడు తన బాణంతో భూరిశ్రవుని చేయి ఖండించి సాత్యకి ప్రాణాలను కాపాడాడు.
భూరిశ్రవుడు ముందు హెచ్చరించకుండా తన మీద దాడి చేసి యుద్ధనీతి తప్పావని అర్జునుని నిందించాడు. అలసిపోయి నిరాయుధుడైన సాత్యకిపై దాడి చేయుట కూడా యుద్ధనీతికి వ్యతిరేకం అని అర్జునుడు ప్రతినింద చేశాడు. అదియును గాక తన స్నేహితుడైన సాత్యకి ప్రాణాలు కాపాడుట తన విధి అని వివరిస్తాడు.
అంతట భూరిశ్రవుడు ఆయుధములు విడచి తన దేహము విడుచుటకు కూర్చుని ధ్యానం చేయసాగాడు. అప్పటికి స్పృహలోకి వచ్చిన సాత్యకి తన ఖడ్గంతో భూరిశ్రవుని తల ఖండించుటకు ఉద్యుక్తుడయ్యాడు. అందరూ వారిస్తున్ననూ వినకుండా సాత్యకి భూరిశ్రవుని తల ఖండించాడు.